సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ తిరుగుబాటును కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా తప్పుపట్టారు. బీజేపీలో చేరి 45 ఏళ్లకే ప్రధాని కావాలని పైలట్ తొందరపడుతున్నారా అని రెబల్ నేతను ప్రశ్నించారు.కరోనా వైరస్‌తో పాటు చైనాతో సరిహద్దు వివాదం వంటి సమస్యల మధ్య సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడం సరైంది కాదని మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజస్ధాన్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ చీఫ్‌గానూ ఎన్నికయ్యారని చెప్పారు. 26 ఏళ్ల వయసులోనే సచిన్ పైలట్ ఎంపీ అయ్యారని, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదిగి పీసీసీ చీఫ్‌గానూ నియమితులయ్యారని ఆమె గుర్తుచేశారు. చదవండి : గవర్నర్‌తో సీఎం భేటీ అందుకేనా!
బీజేపీలో చేరి 45 ఏళ్లకే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా అని పైలట్‌ను ప్రశ్నించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటునూ ఆమె ఆక్షేపించారు. అన్ని డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని, ఇలాంటి నేతలకు పార్టీ పట్ల, సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సింథియాకు పార్టీ ప్రధానకార్యదర్శి పదవి అప్పగించారని, మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినా ఆయన నిరాకరించారని చెప్పారు. సిద్ధాంతాలు లేని వీరంతా స్వార్ధం కోసం పదవుల కోసం పార్టీని వీడుతున్నారని దుయ్యబట్టారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ నిర్వీర్యం చేయలేరని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment