మణిపూర్‌లో ఉత్కంఠ: కాంగ్రెస్ ఎమ్మెల్యే జంప్!
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరి వరకూ సాగిన హోరాహోరీగా పోరు ఫలితాల తర్వాత కొనసాగుతోంది. ఏ పార్టీకి ఓటర్లు మెజార్టీ ఇవ్వక పోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ సింగ్ బీజేపీలోకి పార్టీ ఫిరాయించారు. ఆండ్రో నియోజకవర్గం నుంచి నెగ్గిన శ్యామ్‌కుమార్‌కు ఫిరాయింపు చట్టంపై పూర్తి అవగాహన ఉందని బీజేపీ నేత హిమంతా బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతం బీజేపీకి 32 ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు.
మరికాసేపట్లో బీజేపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తమకుందని బీజేపీ నేత రాంమాధవ్ అన్నారు. మణిపూర్‌లో మ్యాజిక్ ఫిగర్ అయిన 31 మంది ఎమ్మెల్యేల మద్దతు తమ పార్టీకి ఉందని ప్రభుత్వాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
మొత్తం 60 నియోజవర్గాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 28 కైవసం చేసుకోగా, బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31 మంది సీట్లు కావాలి. అయితే బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. తమకే ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను బీజేపీ కోరనున్నారు.