డీఎస్ బాటలో రాపోలు? | congress mp rapolu anand bhaskar unsatisfied with state congress | Sakshi
Sakshi News home page

డీఎస్ బాటలో రాపోలు?

Published Sat, Oct 31 2015 2:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

డీఎస్ బాటలో రాపోలు? - Sakshi

డీఎస్ బాటలో రాపోలు?

- కాంగ్రెస్‌ను వీడి కారెక్కే యోచన
- మాట్లాడుకుందామంటూ ఉత్తమ్ ఫోన్

సాక్షి, న్యూఢిల్లీ:
తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్దన్నగా ఉంటూ, ‘అవమానం భరించలేకపోతున్నా’నంటూ పార్టీని వీడిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) బాటలోనే రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ కూడా నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు డీఎస్ ఆశీస్సులున్నాయని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్‌కున్న అతి కొద్దిమంది ఎంపీల్లో ఒకడినైన తనకు ఏడాదిన్నరగా తగిన విలువ ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామిని చేయడం లేదని రాపోలు ఆవేదన చెందుతున్నారు. పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌లవి రాచరిక పోకడలంటూ ఆక్షేపిస్తున్నారు. కనీసం కార్యకర్తల్లో కూడా విశ్వాసం నెలకొల్పలేని ఇలాంటి నాయకత్వంతో 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వల్ల ఒరిగేదేమీ ఉండదని ఆయన భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

‘డీఎస్ పార్టీని వీడితే వీళ్లంతా పండగ చేసుకున్నారు. బీసీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు’ అంటూ వాపోయారని వారంటున్నారు. కాంగ్రెస్‌ను వీడాలన్న రాపోలు యోచన వెనక స్వీయ రాజకీయ అవసరాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సొంతూరు వరంగల్ జిల్లా కొడకండ్ల పాలకుర్తి అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని యోచన చేస్తున్నారు. తనకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యత్వం తిరిగి దక్కదని,అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గే పరిస్థితీ లేదన్నది ఆయన భావన.

పైగా పాలకుర్తిలో రెడ్డి సామాజిక వర్గ నేతను పీసీసీ నాయకత్వం ప్రోత్సహిస్తున్నందున అధికార టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీగా రాపోలు పదవీకాలం 2018 దాకా ఉన్నా పాలకుర్తి స్థానంపై పట్టు కోసం ఇప్పటి నుంచి రంగంలోకి దిగాలని భావిస్తున్నారంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న డీఎస్ ఆశీస్సులతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఉత్తమ్‌తో సంవాదం
పీసీసీ నాయకత్వంపై రాపోలు వ్యాఖ్యల అనంతరం శుక్రవారం సాయంత్రం ఉత్తమ్ ఆయనకు ఫోన్ చేసినట్టు సమాచారం. ‘ప్రతి సమాచారాన్నీ డీసీసీ అధ్యక్షుడు మీకు ఫోన్‌లో తెలిపారు. ఇంకెలా తెలియపరచాలి?’ అని అడగ్గా రాపోలు తన ఆవేదనంతా వెళ్లగక్కినట్టు తెలిసింది. ‘ఎంపీనైన నాకు కనీసం ఫోనైనా చేసి చెప్పరా? ఎందుకిలా పక్కన పెట్టారు? బలహీన వర్గాలంటే చిన్నచూపెందుకు?’ అంటూ నిలదీశారంటున్నారు. గాంధీభవన్‌కు వస్తే మాట్లాడుకుందామని పిలిచినా, ‘ఆ సంగతి తరవాత చూద్దాం. ఎప్పట్లాగే నన్ను పక్కన పెట్టేయండి’ అంటూ రాపోలు స్పందించినట్టు తెలుస్తోంది.

బీసీల అణచివేతకు కుట్ర
 తెలంగాణ కాంగ్రెస్‌లో బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల నేతలను చిత్తు చేసేందుకు ఒక ఎత్తుగడ ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

‘కాంగ్రెస్ తరఫున తెలంగాణ సాధనలో భాగంగా పార్లమెంటులో అగ్ర నాయకత్వంతో పాటు నా భూమిక, పాత్ర భరించలేని వారందరూ కలగలిపి జరుపుతున్న కుట్రగా నేను భావిస్తున్నా. దాన్ని వివిధ దశల్లో విభిన్న రీతుల్లో చెబుతూ వచ్చాను. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు రాహుల్‌గాంధీ వచ్చారు. ముందు రోజే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలన్నింటితో మాట్లాడాను. నావంతు ఆర్థిక సాయం కూడా చేశా. తెల్లవారితే మా నాయకుడు రాబోతున్నాడని చెప్పివచ్చా. తెల్లవారి చూస్తే ఆహ్వానించే బృందంలో కూడా నా పేరు లేకుండా చేశారు.

ఇలాగే రకరకాల కార్యక్రమాల్లో పలు సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యథకు గురిచేస్తూ, అవమానిస్తూ వచ్చారు. వరంగల్ జిల్లాలో నర్సంపేటలో రైతు భరోసా యాత్ర చేశారు. అసలు ఆ పేరే కరెక్టు కాదు. ఆ యాత్రకు రూపకల్పన చేసినప్పుడు నన్ను అసలు సంప్రదించనే లేదు. మనకు మనమే విశ్వాసం కల్పించుకునే పరిస్థితి లేదు. ఇంకొకరికి ఏం కల్పిస్తాం? రైతుల కోసం మనం నిరసన వ్యక్తం చేయగలుగుతాం. పోరాటం చేయగలుగుతాం. భరోసా ఇవ్వడానికి మనకు అధికారముందా? వరంగల్లు జిల్లాలో ఫలానా కార్యక్రమం చేస్తున్నామని చెప్పొద్దా? నేను అట్టడుగు వర్గానికి చెందినవాడినే కావొచ్చు.

నేనేం నేరుగా పార్లమెంటులోకి ఊడిపడలేదు.  గడియ గడియకు ప్రజల్లో మమేకమవుతున్నవాడిని. కానీ కనీసం నాకు సమాచారం లేదు. జిల్లా కమిటీ నుంచి సమాచారం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నేను సంస్థాగత కార్యక్రమాలను దశాబ్దకాలంగా నిర్వహించిన వాడిని. శిక్షణ ఇచ్చినవాడిని. కనీసం కార్యక్రమం రూపొందించినప్పుడు సంప్రదించలేరా?’ అంటూ ఉత్తమ్‌పై నిప్పులు చెరిగారు.

దిగ్విజయ్ వ్యవహార శైలిపై
‘నిన్నగాక మొన్న ఏఐసీసీ ఇంఛార్జి వెళ్లారు. ఇంకెవరో వెళతారు. కనీసం ఫోన్ చేసి చెప్పేందుకు ఒక అటెండర్ లేరా? ఓ యాభై మంది ఎంపీలు లేరు కదా? మీరు చాలా పెద్దోళ్లు కావొచ్చు. జాతీయ, అంతర్జాతీయ నాయకత్వం కావొచ్చు మీది. కనీసం మీ ఆఫీస్ నుంచి ఒక అటెండర్ ద్వారానైనా సమాచారం ఇవ్వొచ్చు కదా? పీసీసీ అధ్యక్షుడు అంతకంటే బిజీగా ఉన్నాడా? ఒక్కసారి సంప్రదించలేడా? వీటన్నింటినీ భరించాను. నేను ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని. ఆ రాష్ట్రం నుంచి ఉన్న ప్రతినిధిని. మరి ఇంఛార్జి వస్తున్నారని ఆదేశించలేరా?’ అని పేర్కొన్నారు.

ఎందుకు ఇలా జరుగుతోందని అనుకుంటున్నారని ప్రశ్నించగా ‘అట్టడుగు వర్గాల ఆత్మగౌరవం దెబ్బతీసేందుకు పన్నుతున్న ఒక వ్యూహం, ఒక కుట్రగా అనుకుంటున్నాం..’ అన్నారు. ఎవరు చేస్తున్నారని ప్రశ్నించగా ‘ఎత్తుగడలు కొనసాగుతున్నాయి. నేనెప్పుడూ ఫిర్యాదు చేయలేదు. నేను వీళ్ల దగ్గర క్యూ కట్టలేదు. అందరూ కలసి కుట్ర చేస్తున్నట్టుగానే భావిస్తున్నా..’ అని పేర్కొన్నారు. పార్టీని వీడే యోచన ఉందా అని ప్రశ్నించగా ‘నేను నిజాయతీగల కార్యకర్తను. పార్టీని ఎన్నడూ ఎదిరించలేదు. నేతల వ్యవహారం శ్రుతి మించడంతోనే ఇలా మాట్లాడాల్సి వచ్చింది..’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement