
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీనియర్ నేత అరుణ్ జైట్లీ తదితరులను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘25 ఏళ్ల ప్రస్థానం తర్వాత కాంగ్రెస్‌ను వీడాను. 15 రోజుల అంతర్మథనం తర్వాత బీజేపీలో చేరాను.
సైద్ధాంతిక విధానం, ప్రాంతీయ భావజాలం వంటివి లేని కాంగ్రెస్‌లో ఉండలేకపోయాను. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, దేశ సమగ్రతకోసం బీజేపీలో చేరాను. చేనేత సామాజిక వర్గానికి ఆత్మగౌరవం కల్పించేలా ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి బీజేపీ నా కృషిని గుర్తించింది. తెలంగాణ అభివృద్ధి, చేనేత కార్మికుల కోసం కృషి చేస్తాను. ఇవన్నీ బీజేపీతోనే సాధ్యమని నమ్మాను’అని రాపోలు పేర్కొన్నారు.