
పుణే: ‘కాంగ్రెస్–ముక్త్ భారత్’ వంటి నినాదాలు కేవలం రాజకీయపరమైనవనీ, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘అటువంటివి రాజకీయ నినాదాలు. అది ఆర్‌ఎస్‌ఎస్ భాష కాదు. విముక్తి అనే మాటను రాజకీయాల్లోనే వాడుతుంటారు. ఎవరినీ వేరుగా చూసే భాష మేము వాడబోమ’ని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ను సిద్ధాంత కర్తగా చెప్పుకుంటున్న బీజేపీ.. మోదీ ప్రభుత్వం చేస్తున్న ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. జాతి నిర్మాణంలో భాగంగా వ్యతిరేకించిన వారిని సైతం కలుపుకుని పోవాలనేదే తమ సిద్ధాంతమని భగవత్ తెలిపారు. పుణేలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సానుకూల వైఖరి ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. ప్రతికూల భావాలున్నవారే సంక్షోభాలు, విభేదాల గురించే ఆలోచిస్తారన్నారు. అలాంటి వారు జాతినిర్మాణ ప్రక్రియలో ఎంత మాత్రం ఉపయోగపడలేరని స్పష్టం చేశారు.