
మొరాదాబాద్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, దేశంలో నైతికత, సాంస్కృతిక, మానవ విలువలను పెంపొందించేందకు మాత్రమే పనిచేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. మొరాదాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. శనివారం ముగింపు కార్యక్రమం సందర్భంగా మొరాదాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశంలో జరిగే ఎలాంటి ఎన్నికలైనా తాము పరిగణలోకి తీసుకోమని, గత 60 సంవత్సరాలుగా దేశ అత్యున్నత విలువలను కాపాడడమే ముఖ్యమని పేర్కొన్నారు. తమకు రాజకీయాల కన్నా 130 కోట్ల మంది భారతీయుల నైతిక విలువలే తమకు ముఖ్యమని, వారికోసమే ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ చేతిలో ఆర్‌ఎస్‌ఎస్ ఒక కీలు బొమ్మ అంటూ వచ్చిన ఆరోపణలను భగవత్ ఖండించారు.
1925 లో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడినప్పుడు చాలా కొద్ది మంది వ్యక్తులతో మాత్రమే ప్రారంభమయిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కాగా కాలక్రమంలో మా సంస్థ దేశ నిర్మాణానికి నిరంతర అంకితభావంతో ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. దీని ఫలితమే ప్రసుత్తం దేశవ్యాప్తంగా 1.3 లక్షల సభ్యత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కలిగి ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భగవత్ వెల్లడించారు. దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి మేధావులు, సామాజిక సంస్కర్తలు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను తమ భావజాలంలో పుణికిపుచ్చుకోవడం తాము సాధించిన గొప్ప విజయమని అన్నారు.
రష్యా, చైనా, అమెరికా దేశాలు అభివృద్ధి పరంగా శక్తివంతమైన దేశాలుగా ముందుకు సాగుతున్నప్పటికి వాటి వల్ల ఇతర దేశాలకు కలుగుతున్న సమస్యలను చూస్తుంటే వారు తమ గౌరవాన్ని కోల్పోతున్నారని వివరించారు. గంటపాటు తన ప్రసంగాన్ని కొనసాగించిన మోహన్ భగవత్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment