అభిశంసన పిటిషన్‌ ఉపసంహరణ | Congress for protecting dignity and independence of courts | Sakshi
Sakshi News home page

అభిశంసన పిటిషన్‌ ఉపసంహరణ

Published Wed, May 9 2018 1:40 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress for protecting dignity and independence of courts - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్‌ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్‌ ఎంపీలు ఉపసంహరించుకున్నారు. దాంతో ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.

కాంగ్రెస్‌ ఎంపీల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ.. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం చేపట్టాలని ఎవరు ఆదేశించారో వెల్లడించాలని, ఆ ఉత్తర్వుల ప్రతుల్ని తమకు ఇవ్వాలని కోరారు. అప్పుడే ఈ పిటిషన్‌పై ముందుకెళ్లాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోగలమని సిబల్‌ కోర్టుకు చెప్పారు. ధర్మాసనం అందుకు సంసిద్ధత తెలపకపోవడంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు.  

దాదాపు 45 నిమిషాల పాటు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఏకే గోయల్‌ల ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు కొనసాగాయి. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా, అమీ హర్షద్రాయ్‌ యాజ్ఞిక్‌ తరఫున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఏర్పాటుపై పలు సందేహాల్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ జోక్యం చేసుకుంటూ.. బజ్వా, యాజ్ఞిక్‌ల పిటిషన్లను తోసిపుచ్చాలని ధర్మాసనాన్ని కోరారు.

’అభిశంసన తీర్మానంపై 60 మందికిపైగా సభ్యులు సంతకం చేస్తే కేవలం కాంగ్రెస్‌ మాత్రమే సుప్రీంను ఆశ్రయించింది. దీనిని బట్టి రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసును తిరస్కరించడాన్ని సవాలు చేయాలన్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని మిగతా పార్టీలు సమర్ధించడం లేదని అర్థమవుతోంది. మిగతా ఎంపీల తరఫున పిటిషన్‌ దాఖలు చేయడానికి వారికి అధికారం లేదు’ అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు సిబల్‌ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘తనకే సంబంధించిన అంశంపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల్ని జారీ చేయలేరు. అయితే అడ్మినిస్ట్రేటివ్‌ ఆర్డర్‌ ద్వారా మా పిటిషన్‌ను ఐదుగురు జడ్జిల ధర్మాసనానికి కేటాయించారు. ఎవరు ఆ ఉత్తర్వుల్ని జారీ చేశారు? ఒకవేళ ప్రధాన న్యాయ మూర్తి ఆదేశిస్తే ఆ విషయం తెలుసుకునే హక్కు పిటిషనర్లకు ఉంటుంది. అందువల్ల ఉత్తర్వుల ప్రతిని మాకు ఇవ్వాలి. రాజ్యసభ చైర్మన్‌ నిర్ణయాన్ని సవాలు చేయాలా? వద్దా ? అని నిర్ణయించుకునేందుకు  ఆ కాపీ మాకు అవసరం’ అని వాదనలు వినిపించారు.  

బెంచ్‌ ఏర్పాటు నిర్ణయం సీజేఐదే!
మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌గా వ్యవహరిస్తున్న సీజేఐనే ఐదుగురు జడ్జీల బెంచ్‌కు కేసును కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు తనపైనే కావడంతో వ్యూహాత్మకంగా సీజేఐ వ్యవహరించారు. సీనియారిటీలో ఆరోస్థానంలో ఉన్న జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

సిబల్‌ వాదించడంపై న్యాయవాదుల అభ్యంతరం
రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ సీజేఐ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఇవ్వడం వల్ల మీకేమైనా ప్రయోజనం ఉంటుందా? అని ధర్మాసనం పదే పదే సిబల్‌ను ప్రశ్నించింది. అయితే ఉత్తర్వుల కాపీ పొందాకే.. రాజ్యసభ చైర్మన్‌ నిర్ణయాన్ని సవాలు చేయాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని ఆయన సమాధానమిచ్చారు.

అందుకు ధర్మాసనం ఆసక్తి చూపకపోవడంతో.. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సిబల్‌ నిర్ణయించారు. అభిశంసన నోటీసుపై సంతకం చేసిన కపిల్‌ సిబల్‌ ఈ కేసును వాదించడంపై వాదనలు ప్రారంభానికి ముందు న్యాయవాదులు ఆర్‌పీ లూధ్రా, ఏకే ఉపాధ్యాయ అభ్యంతరం తెలిపారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement