పోలీసులకు చుక్కలు చూపించిన విద్యార్థిని | UP Cop Speechless As tudent Asks Tough Questions On Unnao Case | Sakshi
Sakshi News home page

‘ప్రశ్నిస్తాను.. నా రక్షణకు మీరు హామీనా?’

Published Wed, Jul 31 2019 6:53 PM | Last Updated on Wed, Jul 31 2019 7:30 PM

UP Cop Speechless As tudent Asks Tough Questions On Unnao Case - Sakshi

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం నంబరు ప్లేటులేని  ట్రక్కు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని ఈ సంఘటన గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. యూపీ పోలీసులకు చెమటలు పట్టించింది.

వివరాలు.. పోలీసు అధికారులు బుధవారం బారాబంకిలోని పలు పాఠశాలలు, కాలేజీల్లో ‘మహిళలకు భద్రత’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తన ప్రశ్నలతో పోలీసులకు చుక్కలు చూపించింది. ఆమె ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక పోలీసులు నీళ్లు నమిలారు. మునిబా కిద్వాయి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ‘అన్యాయం జరిగితే ప్రశ్నించాలంటున్నారు. నిరసన తెలపాలంటున్నారు. మన రాష్ట్రంలో ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం జరిపాడు. ఆ విషయం అందరికి తెలుసు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడింది. ఫలితంగా ఆమెకు యాక్సిడెంట్‌ అయ్యింది’ అన్నారు.

అంతేకాక ‘ఇది ప్రమాదం కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. ట్రక్కు నంబర్‌ కనిపించకుండా నేమ్‌ ప్లేట్‌కు రంగేసి ఉండడం, అనూహ్యంగా ట్రక్కు కారుపైకి దూసుకెళ్లడం వంటివి అన్ని చూస్తే ఇది ప్రమాదం అనిపించడం లేదు. ఓ సాధరణ వ్యక్తికి వ్యతిరేకంగా నిరసన తెలపవచ్చు.. అదే అధికారంలో ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా నిరసన తెలిపితే.. ఫలితం ఎలా ఉంటుందో ఈ రోజు చూశాం. అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోరు.. ఒక వేళ తీసుకున్నా ఎటువంటి ఫలితం ఉండదు. ప్రశ్నించిన అమ్మాయి నేడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు మీరు తనకెలా న్యాయం చేస్తారు. నేను నిరసన తెలుపుతాను.. నా రక్షణకు హామీ ఏది. నాకేం కాదని మీరు హామీ ఇవ్వగలుగుతారా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కిద్వాయి మాట్లాడుతున్నంతసేపు.. మిగతా స్టూడెంట్స్‌ చప్పట్లు కొడుతూనే ఉండగా.. పోలీసులు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. 

ఇదిలా ఉండగా.. కుల్దీప్‌ సింగ్‌ వల్ల తనకు ప్రాణాపాయం ఉందని.. బాధితురాలి పోలీసు శాఖకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ‘బాధితురాలి కుటుంబం నుంచి 25 ఫిర్యాదులు వచ్చాయి. కానీ వాటిల్లో ఒక్కదాంట్లో కూడా ఆమె తనకు రక్షణ కల్పించాలని కోరలేదు. ఏది ఏమైనా జరిగిన ప్రమాదం గురించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామ’ని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement