
ఢిల్లీ ప్రభుత్వం అందజేసే ఉచిత భోజనం కోసం గుమికూడిన వారిని చెదరగొడుతున్న పోలీసులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి దేశంలో మరో నలుగురు బలయ్యారు. కేవలం ఒక్క రోజులోనే తాజాగా 82 కొత్త కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా కోవిడ్–19 బాధితుల సంఖ్య 694కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో కేసుల పెరుగుదల ఇతర దేశాలతో పోలిస్తే నిలకడగా ఉందని స్పష్టం చేసింది. దేశంలో వైరస్ వ్యాప్తి ఇప్పటికీ రెండో దశలోనే ఉందని, మూడో దశలో మాదిరిగా సామాజిక వ్యాప్తి జరుగుతోందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
ఇదిలా ఉండగా కరోనా వైరస్ కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. దేశంలో రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న మాట నిజమే అయినప్పటికీ వేగం మాత్రం కొంచెం నిలకడగా ఉందని.. కొంతమేరకు తగ్గిందని కూడా చెప్పవచ్చునని లవ్ అగర్వాల్ తెలిపారు. అయినప్పటికీ సామాజిక దూరం పాటించడం, వ్యాధి బారిన పడ్డ వారు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం, ప్రజలందరూ ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండటం చాలా కీలకమని స్పష్టం చేశారు. ఈ పద్ధతులను కచ్చితంగా కొనసాగిస్తేనే కరోనాపై విజయం సాధించవచ్చునని అన్నారు.
ఇప్పటివరకూ 16 మరణాలు..
కరోనా కారణంగా దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ 16 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 694 కాగా ఇందులో 42 మందికి వ్యాధి నయమైపోయిందని, ఒక్కరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. మొత్తం కేసుల్లో 47 మంది విదేశీయులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 124 కేసులు ఉండగా వీరిలో ముగ్గురు విదేశీయులు. కేరళలో 8 మంది విదేశీయులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 118కి చేరుకుంది. కర్ణాటకలో 41 కేసులు ఉన్నాయి. గుజరాత్ విషయానికి వస్తే ఒక విదేశీయుడితో కలిపి 38 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు ఏ కేసులు నమోదుకానప్పటికీ బుధవారం కొన్ని కొత్త కేసులు బయటపడటంతో ఒక విదేశీయుడితో కలిసి 35 మంది వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో మొత్తం 33 కేసులు నమోదు కాగా, హరియాణాలో 30 కేసులు ఉన్నాయి. ఒడిశాలో రెండు కేసులు బయటపడ్డాయి.
17 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసుపత్రులు
కరోనా వైరస్ బాధితులను ఎదుర్కొనేందుకు దేశంలోని పదిహేడు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆసుపత్రులను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దేశంలో సామాజిక కరోనా వ్యాప్తిపై ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్నదాంట్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఇంటివద్దకే మందులు...
కోవిడ్–19 వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల కదలికలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంటివద్దకే మందులు సరఫరా అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు ఆరోగ్య శాఖ మెడికల్ రీటెయిలర్లకు ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మందులకు సంబంధించిన బిల్లులను ఈమెయిల్ ద్వారా లైసెన్సుదారుడు పంపాల్సి ఉంటుందని తెలిపింది.
విమానాలపై 14 వరకూ నిషేధం
అన్ని అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలపై విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 14 వరకూ పొడిగిస్తూ పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, సరుకు రవాణా విమానాలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకూ నిషేధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment