ముంబైలో సొరంగం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల్లో ఎక్కువ మంది చికిత్సతో క్రమంగా కోలుకుంటుండడం ఊరట కలిగిస్తోంది. రికవరీ రేటు తాజాగా 29.36 శాతానికి పెరిగింది. అంటే ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు సంపూర్ణంగా కోలుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. భారత్‌లో యాక్టివ్‌కరోనా కేసులు ప్రస్తుతం 37,916 కాగా, 16,539 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల వ్యవధిలో 103 మంది కరోనా వల్ల మృతి చెందారు. అలాగే కొత్తగా 3,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వల్ల ఇప్పటివరకు 1,886 మంది ప్రాణాలు కోల్పోయారని, పాజిటివ్ కేసుల సంఖ్య 56,342కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. భారత్‌లో కరోనా బారిన పడిన వారిలో 111 మంది విదేశీయులు ఉన్నారు.
భారత్‌లో కరోనా రహిత జిల్లాలు 216
దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 42 జిల్లాల్లో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని పేర్కొంది. మరో 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు బయట పడలేదని తెలియజేసింది. 36 జిల్లాల్లో గత 14 రోజులుగా, 46 జిల్లాల్లో గత 7 రోజులుగా కొత్త కేసులేవీ వెలుగు చూడలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తే కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరడాన్ని నివారించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ సూచించారు.
కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి
కరోనా వైరస్ నియంత్రణ చర్యలను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని లవ్ అగర్వాల్ అన్నారు. లాక్‌డౌన్ ఆంక్షల్లో మినహాయింపులు ఇస్తుండడం, వలస కూలీలు సొంత ప్రాంతాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో మన ముందు పెద్ద సవాలు ఉందని, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోక తప్పదని వ్యాఖ్యానించారు.
2.5 లక్షల మంది స్వస్థలాలకు..
లాక్‌డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేర్చడానికి 222 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు హోంశాఖ తెలిపింది. ఈ రైళ్లలో 2.5 లక్షలకుపైగా వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులు సొంత ప్రాంతాలకు చేరుకున్నారని వివరించింది. లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని యోచిస్తున్నట్లు హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment