కర్ణాటకలోని చిక్‌మగళూరులో బంధువుల సమక్షంలో మాస్కులు ధరించి పెళ్లి చేసుకుంటున్న వధూవరులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య 12 వేలు దాటింది. దేశంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 28 మంది కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో 9 మంది, గుజరాత్‌లో ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కన్నుమూశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,759కి, మొత్తం మరణాల సంఖ్య 420కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఇండియాలో యాక్టివ్‌కరోనా కేసులు 10,824 కాగా, 1,514 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.
దేశంలో కరోనా బారిన పడిన వారిలో 76 మంది విదేశీయులు ఉన్నారు. దేశంలో 325 జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం చెప్పారు. ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న పటిష్టమైన నియంత్రణ చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్రదే తొలిస్థానం. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 187 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 53 మంది, గుజరాత్‌లో 36, ఢిల్లీలో 32, తమిళనాడులో 14, పంజాబ్‌లో 13, ఉత్తరప్రదేశ్‌లో 13 మంది మృతిచెందారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 2,919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ధారావిలో పాజిటివ్ కేసులు 86
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఇక్కడ గురువారం ఒక్కరోజే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86కు చేరింది. ధారావిలో కరోనాతో ఇప్పటికే 9 మంది మృతిచెందారు. ముస్లిం నగర్, ముకుంద్ నగర్, సోషల్ నగర్, రాజీవ్ నగర్, సాయిరాజ్ నగర్, ట్రాన్సిట్ క్యాంప్, రామ్‌జీ ఛాల్, లక్ష్మీ ఛాల్, జనతా సొసైటీ, శివశక్తి నగర్ తదితర ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇవన్నీ ధారావి మురికివాడలో భాగమే. ఇక్కడ 15 లక్షల మంది నివసిస్తున్నారు.
లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయండి: కేంద్ర హోంశాఖ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఫేసు మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించడం, ఒకేచోట ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడకపోవడం వంటి నిబంధనల అమలు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉమ్మివేయకుండా చూడాలని చెప్పారు. పని ప్రదేశాల్లో చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మద్యం, గుట్కా, పొగాకు అమ్మకాలపై ప్రస్తుతం నిషేధం ఉందని, దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా
విదేశాల్లో ఉంటున్న భారతీయులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు ఈ వైరస్ సోకిందని, ఇప్పటిదాకా 25 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడే ఉండాలని, ఇప్పటికిప్పుడు వారందరిని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ కోసం 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లుప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment