జైపూర్: కరోనా కష్టకాలంలో పెళ్ళిళ్ళు చేస్తున్నారా? అయితే పెళ్ళి ఖర్చుతో పాటు కోవిడ్ ఖర్చుని కూడా లెక్కేసుకోవాలి సుమా! రాజస్తాన్‌లోని భిల్వారాలో ఓ వ్యాపారి కొడుకు పెళ్ళి ఖర్చుకి, అనూహ్యంగా కోవిడ్ ఖర్చు తోడైంది. కొడుకు పెళ్ళిలో కోవిడ్ నిబంధనలను అతిక్రమించడంతో, 16 మందికి కరోనా సోకగా, ఒకరు మరణించారు. దీంతో పెళ్ళి కొడుకు ఇంటివారు అదనంగా ఆరు లక్షల రూపాయలకు పైగా జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు జరిమానా కాకుండా, కరోనా సోకడానికి కారణమైనందుకుగాను 15 మంది కోవిడ్ చికిత్సకు, 58 మంది బంధువుల అంబులెన్స్ ఖర్చులతో సహా రూ.6.26 లక్షల కోవిడ్ ఖర్చులను పెళ్ళి కొడుకు కుటుంబం నుంచి ప్రభుత్వం వసూలు చేసింది.
పెళ్ళి కొడుకు తండ్రి పట్టణంలో బాగా పేరున్న వ్యక్తి కావడంతో జూన్ 13న అంగరంగ వైభవంగా ఈ పెళ్ళి జరిపించారు. భిల్వారాలోని భదాడ ప్రాంతంలో జరిగిన ఈ పెళ్ళికి వచ్చిన అతిథుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. కోవిడ్ పరీక్షల్లో వధువు, వరుడు, వరుడి తండ్రి, తాతతో సహా మొత్తం 16 మందికి కరోనా సోకినట్టు వెల్లడయ్యింది. తాత కోవిడ్‌తో మరణించారు. ఇక పెళ్ళికి హాజరైన 58 మంది బంధువులను క్వారంటైన్‌లో ఉంచారు. కేవలం 50 మంది హాజరు కావాల్సిన ఈ పెళ్ళిలో మొత్తం 1000 మంది పాల్గొన్నారు. దీంతో భిల్వారా జిల్లా కలెక్టరు విషయాన్ని తీవ్రంగా పరిగణించి, పెళ్ళికొడుకు ఇంటి వారికి జరిమానా వడ్డించారు.
Comments
Please login to add a commentAdd a comment