
చండీగఢ్: కరోనా అనుమానిత మహిళ మృతదేహాన్ని దహనం చేస్తున్నారనే వార్తలతో స్థానికులు పోలీసులపై దాడి చేసిన ఘటన హరియాణాలోని అంబాలాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో ఓ మహిళ (60) పట్టణంలోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. శవాన్ని దహనం చేసేందుకు డాక్టర్లు, పోలీసులు శ్మశాన వాటికకు చేరుకోగానే.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన స్థానికుల గుంపు వారిపై రాళ్లతో దాడికి దిగింది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు.
(చదవండి: జర్నలిస్టులకు రూ .10 లక్షల బీమా: హర్యానా)
ఆస్థమాతో బాధపడుతున్న మహిళ.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. మహిళకు సంబంధించిన కోవిడ్ నిర్ధారణ రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనాతో చనిపోయినా.. వైరస్ అనుమానితులుగా చనిపోయినా మృతదేహాన్ని దహనం చేసేందుకు పూర్తి రక్షణాత్మక పద్ధతులు పాటిస్తామని వెల్లడించారు. గ్రామస్తులు అనవసరంగా అంత్యక్రియలను అడ్డుకున్నారని తెలిపారు. స్థానికులకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదని అంబాల డీఎస్పీ రామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడిలో ఒక అంబులెన్స్ కూడా ధ్వంసమైందన్నారు. లాక్‌డౌన్ పాటించకుండా.. తమ విధులను అడ్డుకున్నవారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 289 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ముగ్గురు మరణించారు. అంబాల పట్టణంలో 12 కేసులు నమోదయ్యాయి.
(చదవండి: ఉద్దవ్ ఠాక్రే పదవీ గండం నుంచి బయటపడతారా?)
Comments
Please login to add a commentAdd a comment