పింప్రి, న్యూస్‌లైన్ : శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉండడంతో ఈసారి ఏవిధంగానైనా టికెట్లు సాధించి మళ్లీ శాసనసభకు ఎన్నిక కావాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు నగరమంతటా పర్యటిస్తున్నారు.
తాము ఏమిచేయాలనుకుంటున్నామనే విషయాన్ని ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) చెందిన 36 మందికిపైగా కార్పొరేటర్లు ఈసారి ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారు. శాసనసభకు వెళ్లేందుకు కార్పొరేటర్ పదవి రాజమార్గంగా కనిపించడంతో టికెట్‌కోసం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటున్నారు. నగరంలోని ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో నలుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య పెరిగే అవకాశముంది. పార్టీల మధ్య పొత్తులు, ఏ నియోజక వర్గం ఏ పార్టీకి దక్కుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలోనూ ఔత్సాహికులతోపాటు, ప్రస్తుత ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పైరవీలు చేస్తున్నారు.
గతంలో కార్పొరేషన్ పదవులను చేపట్టిన వారే ఎమ్మెల్యేలు ఎంపీలు, మంత్రులయ్యారు. ఇంకా విశేషమేమిటంటే గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో అప్పటిదాకా కార్పొరేటర్ పదవుల్లో కొనసాగిన బాపు పఠారే, మాధురీ మిసాల్, చంద్రకాంత్ మొకాటే, మహాదేవ్ బాబర్‌లు ఎమ్మెల్యేలయ్యారు. దివంగత రమేష్ వాంజలే కూడా గతంలో కార్పొరేటరే. ఆయన ఆకస్మిక మరణంతో స్థానిక కార్పొరేటర్ బీంరావు టాప్కిర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే అనిల్ బోస్లే కూడా కార్పొరేటర్‌గా పనిచేస్తూనే శాసనసభ ఎన్నికల బరిలోకి దిగి ఎమ్మెల్యే అయ్యారు.
ఇంకా వీరితోపాటు భాయి వైద్, రమేష్ భాగవే, మాజీ మంత్రి చంద్రకాంత్ ఛాజెడ్, బాలాసాహెబ్ శివర్కర్, శశికాంత్ సుతార్,అనిల్ శిరోలే, అడ్వొకేట్ వందనా చవాన్ తదితరుల కార్పొరేటర్ స్థాయినుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులస్థాయికి ఎదిగినవారే. రాజకీయాల్లో ఇప్పుడు తొలి అర్హత కార్పొరేటర్‌గా ఎన్నికవడమే. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిలో కసబాపేట్ నుంచి గణేష్ బిడకర్, హేమంత్ రసణే, ముక్తా తిలక్, రవీంద్ర ధంగేకర్, రూపాలీ పాటిల్, దీపక్ మన్కర్, అరవింద్ షిండే, ఉదయ్ కాంత్ అందేకర్‌లు ఉన్నారు.
అదేవిధంగా పుణే కంటోన్మెట్ నుంచి అజయ్, ప్రశాంత్, ప్రదీప్ గైక్వాడ్ ఉన్నారు. శివాజీనగర్ నుంచి దత్తా బహిరట్, మేధా కులకర్ణి, రాజు పవార్ ఉన్నారు. ఇంకా సుభాష్ జగ్తాప్, శివలాల్ భోస్లే, అశ్వినీ కదమ్, దినేష్ ధాడవే, రవీంద్ర మాలవడకర్, అడ్వొకేట్ అభయ్ ఛాజెడ్, ఆబా బాగుల్, శ్రీనాధ్ భిమాలే, రాజేంద్ర శిలీమరకర్‌లు ఉండగా, ఖడక్‌వాస్లా నుంచి వికాస్ దాంగట్, శంకర్ కేమసే, దిలీప్ బరాట్, దత్తా ధనకవడే, సచిన్ దోడకే, వసంత మోరే ఉన్నారు.
హడప్సర్ నుంచి సునీల్ (బండు గైక్వాడ్) చేతన్ తుపే, వైశాలీ బన్కకర్, ప్రశాంత్ జగ్తాప్, ఆనంద్ అలకుంటే, నానా భానిగిరే, వడగావ్‌శేరి నుంచి బాపురావ్ కర్ణేగురూజీ, ఉషా కలమేకర్, సచిన్ భగత్. కోత్‌రోడ్ నుంచి అడ్వొకేట్ కిశోర్ షిండే, జయశ్రీ మారణే, పృథ్వీరాజ్ సుతార్, ప్రమోద్ నిమ్హణ్ తదితరులు తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కార్పొరేటర్‌కు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది? వారిలో ఎవరు గెలుపొందుతారు? అనే విషయం తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
శాసనసభ ఎన్నికలు పైరవీలు మొదలు
Published Tue, Sep 9 2014 10:28 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement