మీసాలు రాకుండా మోసం చేయలేరా?
మీసాలు రాకుండా మోసం చేయలేరా?
Published Thu, Jul 13 2017 2:00 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
పట్నా: బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎలాంటి అవినీతికి ఆస్కారంలేని స్వచ్ఛమైన పాలనను అందిస్తానని రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్‌ను పదవి నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో మరో నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని తేజస్వీ ప్రసాద్‌తోపాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు నితీష్ కుమార్ తేల్చి చెప్పారు.
2005-06లో కుంభకోణం జరిగినప్పుడు తన కుమారుడికి 14 ఏళ్లని, అప్పుడు వాడి మూతిమీద మీసం కూడా మొలవలేదని, మీసం మొలవకుండా వాడెలా అవినీతికి పాల్పడతారని లాలూ ప్రసాద్ యాదవ్ నానా యాగి చేస్తున్నారు. తనకు మీసం మొలవని వయస్సులో తానెలా తప్పు చేస్తానని తేజస్వీ ప్రసాద్ కూడా సవాల్ చేస్తున్నారు. మీసం మొలవని వయస్సులో తప్పు చేయరా, చేసినా క్షమించి వదిలేయలా? వారి ఉద్దేశం ఏమిటీ? నిర్భయ కేసులో మైనరైన నిందితుడికి కూడా అప్పటికి మూతిమీద మీసం మొలవలేదు. అయినప్పటికీ అతన్ని ఉరితీయాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేశారు. చట్టం అందుకు అంగీకరించదు కనుక జువెనైల్ చట్టం కింద అతనికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించి విడుదల చేశారు.
ఇక్కడ ప్రధానంగా నేరం చేసిందీ తేజస్వీ ప్రసాద్ అన్న ఆరోపణకాదు. 2004 నుంచి 2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు ఒకరికి రైల్వే హోటల్ కాంట్రాక్టును అనుచితంగా ఇచ్చినందుకు 'క్విడ్ ప్రో' కింద తన కుమారుడు తేజస్వీ పేరిట పట్నాలో విలువైన ప్లాట్లను పొందారన్నది ఆరోపణ. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం లాలూ ప్రసాద్ 2005లో రైల్వే హోటల్ కాంట్రాక్టు ఒకరికి ఇచ్చారు.
అందుకు బదులుగా 2006లో బినామీల కంపెనీ పేరిట కొన్ని విలువైన ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి. ఆ ప్లాట్లు 2014లో తేజస్వీ ప్రసాద్ పేరిట బదిలీ అయ్యాయి. నాటి క్విడ్ ప్రో కిందనే ఈ ప్లాట్లు తేజస్వీకి అందాయా, ఆయన డబ్బులు పెట్టి మార్కెట్ ధరకు కొనుక్కున్నారా ? కొనుక్కుంటే 2015 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ ప్లాట్ల వివరాలు ఎందుకు పొందుపర్చలేదన్న ప్రశ్నలు అవినీతి ఆరోపణలకు ఆస్కారమిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తేజస్వీ ఓ రాజకీయ నాయకుడిగా తన డిప్యూటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేసి విచారణను ఎదుర్కోవాల్సిందే. 'అమాయకుడిని, మూతి మీద మీసాలు రాలేదు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకం' అంటూ మాయా మాటలు చెబితే మోసపోయేంత అమాయకులు కాదు నేటి ప్రజలు.
Advertisement
Advertisement