అవినీతి చక్రవర్తి చంద్రబాబు
♦ ఆయన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించండి
♦ అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు
♦ ఫిరాయింపు కేసులను స్పీకర్ నుంచి తప్పించాలి
♦ ఎన్నికల సంఘానికి నివేదించేలా ఆర్డినెన్స్ తేవాలి
♦ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు వైఎస్ జగన్ వినతి
♦ ఏచూరి, పవార్, శరద్‌యాదవ్‌తోనూ జగన్ భేటీ
న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి కుంభకోణాలను, అనైతిక రాజకీయాలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశరాజధాని ఢిల్లీలో ఎండగట్టారు. అవినీతి సొమ్ముతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న అవినీతి చక్రవర్తి చంద్రబాబు నిజ స్వరూపాన్ని జాతీయ స్థాయి నేతలకు వివరించారు. రాష్ర్టంలో కొనసాగుతున్న భారీ కుంభకోణాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల గురించి తెలుసుకుని వారు విస్తుపోయారు. అనైతిక రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి మద్దతు ప్రకటించా రు.
‘సేవ్ డెమొక్రసీ’ పేరిట వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కూడిన బృందం మంగళవారం దేశ రాజధానిలో కేం ద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తోపాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీ(యూ) సీనియర్ నేత శరద్ యాదవ్‌తో సమావేశమైంది. చంద్రబాబు సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, అప్రజాస్వామిక, అరాచక పాలన, భారీ కుంభకోణాల గురించి ఉదాహరణల సహితంగా జగన్ వారికి వివరించారు.
రూ.1.34 లక్షల కోట్ల అవినీతి సంపాదన కోసం బాబు ప్రభుత్వం చేసిన 31 కుంభకోణాల వివరాలను ఆధారాలతో సహా ప్రచురించిన ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని అందించారు. అందులో పేర్కొన్న ఒక్కో సంఘటన గురించి జగన్ వివరించినప్పుడు.. వారిలో విస్మయం వ్యక్తమయింది. అవినీతి, ఎమ్మెల్యేల కొనుగోళ్ల తీరును చూసి వారు ఆశ్చర్యపోయారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికి వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఉద్యమంలో కలిసి వస్తామని, బాబు అనైతిక రాజకీయాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఫిరాయింపుల జాఢ్యానికి అడ్డుకట్ట వేయకపోతే.. అధికార పార్టీ కేంద్రంగా అరాచకాలు మరింత పెచ్చుమీరి ప్రజాస్వామ్యాన్నే సవాలు చేసే ప్రమాదం ఉందనే ఆందోళన జాతీయ నేతల్లో వ్యక్తమైంది.
సానుకూలంగా స్పందించిన హోంమంత్రి
రాష్ట్రంలో చంద్రబాబు భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడి, ఆ సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైఎస్ జగన్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించారు. రెండేళ్ల పాలనలోనే రూ.లక్ష కోట్లను దాటిన చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఫిరాయింపు కేసులను స్పీకర్‌నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జగన్ బృందం చెప్పిన విషయాలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సావధానంగా వినడంతోపాటు సానుకూలంగాస్పందించారు. బాబు అవినీతి, కుంభకోణాల వివరాలున్న ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పుస్తకాన్ని హోంమంత్రి ఆసాం తం పరిశీలించారు. ఈ అంశాలతో పాటు.. విభజన హామీలు నెరవేర్చడానికి తన వంతు సహకారం అందిస్తానని హోం మంత్రి చెప్పారు.
కనీవినీ ఎరుగని అవినీతి
అవినీతి, అనైతిక రాజకీయాలపై ఉద్యమిస్తున్న వైఎస్సార్‌సీపీ బృందానికి ఢిల్లీలో సాదర స్వాగతం లభించింది. జాతీయ స్థాయి నేతలందరూ జగన్ వివరించిన అంశాలను విని సానుకూలంగా స్పందించారు. ఉదయం 10.15 గంటల సమయంలో జన్‌పథ్‌లోని శరద్‌పవార్ నివాసంలో జగన్ బృందం ఆయనను కలిశారు. రూ.కోట్లు వెదజల్లి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు అనైతిక రాజకీయాలను జగన్ ఆయనకు వివరించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని, వాటిని నిరోధించడంపై అఖిలపక్షంలో చర్చ జరగాలని పవార్ అభిప్రాయపడ్డారు.
వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి తన అందడండలు ఉంటాయని, పోరాటంలో కలిసి నడుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత జగన్ బృందం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి రాష్ర్టంలో పరిస్థితులను వివరించారు. ఇంతటి అవినీతిని తానెన్నడూ చూడలేదని ఏచూరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆందోళనలో కలిసివస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో జేడీయూ సీనియర్ నేత శదర్‌యాదవ్ నివాసంలోనూ జగన్ బృందానికి సాదర స్వాగతం లభించింది. జగన్ బృందం చేసిన వాదనతో ఆయన ఏకీభవించారు. ఫిరాయింపుల జాఢ్యం విస్తరిస్తే.. అన్ని పార్టీలకూ ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జరిపే ఉద్యమంలో తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.