'ఒక్కో ఎమ్మెల్యేతో రూ.40కోట్లకు బేరం' | ys jagan mohan reddy fires on cm chandrababunaidu | Sakshi
Sakshi News home page

'ఒక్కో ఎమ్మెల్యేతో రూ.40కోట్లకు బేరం'

Published Tue, Apr 26 2016 10:58 AM | Last Updated on Sat, Jul 28 2018 3:49 PM

'ఒక్కో ఎమ్మెల్యేతో రూ.40కోట్లకు బేరం' - Sakshi

'ఒక్కో ఎమ్మెల్యేతో రూ.40కోట్లకు బేరం'

న్యూఢిల్లీ: కోట్లు కుమ్మరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం సేవ్ డెమోక్రసీ పేరిట ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న కోట్ల నల్లధనం చంద్రబాబుకు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు.

డబ్బుకు లొంగని వారిని మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రలోభపెడుతున్నారని, అందుకే తాము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వచ్చామని చెప్పారు. ఈరోజు ముఖ్యమైన నేతలందరినీ కలవబోతున్నామని, అపాయింట్లమెంట్ల ప్రకారం పార్టీ ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, పరిస్థితులను ఢిల్లీలోని రాజకీయ పెద్దలకు వివరించనున్నామని చెప్పారు. చంద్రబాబు ఏరకంగా అనైతిక చర్యలు చేస్తున్నారో అందరికీ వివరిస్తున్నామన్నారు. బాబుకు ప్రజల్లోకి వెళ్లే విశ్వాసం లేదని, ఆయనకు ఇక ఓట్లు రావని తెలుసని అందుకే ఆయనకు ఎన్నికల్లో వెళ్లే ధైర్యం చంద్రబాబు చేయడం లేదని అన్నారు.

రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా పేరుతో అక్కాచెల్లెమ్మలను, జాబులేనివారికి నిరుద్యోగ భృతి పేరుతో యువతను దారుణంగా మోసం చేశారని చెప్పారు. చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగెత్తారని, బాబు పాలన మాకొద్దు బాబో అని విలపిస్తున్నారని చెప్పారు. ఒక్కో ఎమ్మల్యేకు 20 నుంచి 40 కోట్లు ఇవ్వడం చేస్తున్నారని ఇంతపెద్ద మొత్తం నల్లడబ్బు చంద్రబాబుకు ఎలా వస్తుందని నిలదీశారు.

తమ పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ప్రతి పౌరుడు బాబును నిలదీయాలి, తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆడియో, వీడియోలతో దొరికిపోయిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించకూడదని అడిగారు. రెండేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతిపాలనను పూర్తి వివరాలతో 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తక రూపంలో ఇస్తున్నామని చెప్పారు.

అమరావతి పేరుతో భూముల దోపిడీ, కరెంటు దోపిడీ, ఇసుక మాఫియాలను ఇలా అన్ని అంశాలు పుస్తకంలో వివరించామని చెప్పారు. మొత్తం లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారం ఈ పుస్తకంలో ఉందని చెప్పారు. పూర్తి ఆధారాలతో, డాక్యుమెంట్లు ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. ఈ పుస్తకాన్ని జాతీయ నాయకులకు ఇస్తామని చెప్పారు. ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్.. రాష్ట్రాలు ఏవైనా పార్టీ ఫిరాయింపులు తప్పే అని చెప్పారు. బాబు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించకపోవడం ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement