బాధితుల కంటే రికవరీ ఎక్కువ | Covid 19 Recovery Cases More Than Active Cases In India | Sakshi
Sakshi News home page

బాధితుల కంటే రికవరీ ఎక్కువ

Published Thu, Jun 11 2020 12:57 AM | Last Updated on Thu, Jun 11 2020 4:45 AM

Covid 19 Recovery Cases More Than Active Cases In India - Sakshi

మహారాష్ట్రలోని కరాడ్‌లో చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వెళుతున్న కరోనా బాధితుడికి చప్పట్లతో వీడ్కోలు పలుకుతున్న వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది

న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటిసారిగా యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రికవరీ రేటు 48.99శాతం ఉండడం ఊరట కలిగిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 1,33,632 కాగా, డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన రోగుల సంఖ్య 1,35,206గా ఉంది. కరోనా సోకిన వారిలో 80శాతం మందికి వైరస్‌తో ఎలాంటి హాని జరగడం లేదని, వారంతా బాగా కోలుకుంటున్నారని ఢిల్లీలో సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ నీరజ్‌ గుప్తా చెప్పారు.

మిగిలిన 20శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం వస్తోందని, అలా ఆస్పత్రిలో చేరిన రోగుల్లో 5శాతం మందికి మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. కోవిడ్‌–19 సోకితే భయపడాల్సిన పనేమీ లేదని, అలాగని నిర్లక్ష్యం కూడా పనికి రాదని ఆయన చెప్పారు. భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటిస్తూ ప్రభుత్వం విధించిన నిబంధనల్ని ఆచరించాలని హితవు చెప్పారు.

24 గంటల్లో 9,985 కేసులు
భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలిస్తూ ఉండడంతో వైరస్‌ కూడా విస్తరిస్తోంది. 24 గంటల్లో 9,985 కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 2,76,583కి చేరుకుంది. ఇక కొత్తగా 279 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,745కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం వెల్లడించారు.

ఢిల్లీలో 30 వేలు దాటేశాయ్‌! 
ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఒకే రోజు 1366 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 31,398కి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో కేసులు ఇంకా పెరుగుతాయని, అసాధారణ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం కేజ్రివాల్‌ అన్నారు. బుధవారం ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స స్థానికులకే ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం తోసిపుచ్చడంతో రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఉన్న వైద్య సౌకర్యాలు సరిపోవేమోనని వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు.

ఇది వాదోపవాదాలు చేసుకునే సమయం కాదని,లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆదేశాలు పాటిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం ప్రజలు ఢిల్లీకి వస్తే జూలై 31 నాటికి రాష్ట్రానికి 1.5 లక్షల పడకలు అవసరం అవుతాయని కేజ్రివాల్‌ చెప్పారు. కోవిడ్‌కు చికిత్స చేస్తున్న ఆస్పత్రుల బయట ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శి విజయ్‌ దేవ్‌కి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ బైజాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి? ఆస్పత్రిలో అడ్మిషన్‌కి ఎవరిని కాంటాక్ట్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది? వంటి వివరాలతో కూడిన ఈ బోర్డులను వెంటనే పెట్టాలన్నారు.

వూహాన్‌ని మించిన ముంబై  
కోవిడ్‌–19 కోరల్లో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది. మొదట్నుంచి ఆ రాష్ట్రమే అగ్రభాగంలో ఉంది. ఇప్పటివరకు 90,787 కేసులు నమోదయ్యాయి. వాణిజ్య రాజధాని ముంబైలో కేసులు 51 వేలు దాటిపోయాయి. దీంతో ముంబైలో వూహాన్‌ (50,333) కంటే ఎక్కువ కేసులు నమోదైనట్టయింది. అయితే మహారాష్ట్రలో సామూహిక వ్యాప్తి దశకు ఇంకా చేరుకోలేదని, అవన్నీ ఊహాగానాలేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement