‘‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని మేం అధికారంలోకి రానివ్వం. కాంగ్రెస్‌కు మద్దతివ్వం. కాంగ్రెసేతర, బీజేపీయేతర లౌకిక కూటమిని మేం ఏర్పాటుచేస్తాం.
పార్లమెంటు ఎన్నికలపై సీపీఎం ప్రకటన
‘‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని మేం అధికారంలోకి రానివ్వం. కాంగ్రెస్‌కు మద్దతివ్వం. కాంగ్రెసేతర, బీజేపీయేతర లౌకిక కూటమిని మేం ఏర్పాటుచేస్తాం. అది బీజేపీ అధికారంలోకి రాకుండా సమర్థవంతంగా నిరోధిస్తుంది’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ ప్రకటించారు. త్రిపుర రాజధాని అగర్తలాలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశం సందర్భంగా కారత్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. అవినీతి, అధిక ధరల కారణంగా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని.. బీజేపీ వంటి మతతత్వ శక్తులు ఆర్‌ఎస్‌ఎస్ సాయంతో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రచారం చేస్తున్న అంశంపై కూడా కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఈ ప్రచారం వల్ల మోడీకి కార్పొరేట్ సంస్థల నుంచి నిరంతర మద్దతు లభిస్తోందన్నారు. ‘‘కానీ ఆయన గతమేంటో మాకు తెలుసు. ఆయన అధికారంలోకి రాకుండా ఆపేందుకు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టం’’ అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. ఆ ప్రశ్నే తలెత్తదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెసేతర, బీజేపీయేతర శక్తులు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవన్నారు.