అమెరికా నుంచి భారత్‌కు ఏటా వెయ్యి కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచంలో పాతిక కోట్ల మంది ప్రజలు తాము పుట్టిన దేశంలో కాకుండా బతుకుతెరువు కోసం పరాయి దేశంలో జీవిస్తున్నారు. వారు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఏటా మాతృదేశంలోని కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. అలా వారు తమ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా పరోక్షంగా తోడ్పడుతున్నారు.
ప్రపంచంలో ఇలా ఉద్యోగం చేస్తున్న దేశం నుంచి మాతృదేశానికి ఆర్థిక వనరులు తరలడంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ 1990 నుంచి పరిశీలిస్తే 2015 సంవత్సరానికి ఎంతో పెరిగాయి. ఒక్క 2015 సంవత్సరంలోనే ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లిన నిధులు మొత్తం 58, 200 కోట్ల డాలర్లని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ కూడా ఈ అంకెలనే పేర్కొంది. 19 శాతం మంది వలసదారులున్న అమెరికా నుంచి 2015 సంవత్సరంలో 13,350 కోట్ల డాలర్లు ఇతర దేశాలకు వెళ్లాయి. ప్రధానంగా నిధులు అభివద్ధి చెందిన దేశాల నుంచి అభివద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలకు వెళుతున్నాయి.
అమెరికా నుంచి మెక్సికోకు 2,430 కోట్ల డాలర్లు, చైనాకు 1,620 కోట్ల డాలర్లు, భారత్‌కు వెయ్యి కోట్ల డాలర్లు బదిలీ అయ్యాయి. అమెరికా తర్వాత ఎక్కువ మంది వలసదారులున్న జర్మనీ నుంచి 2,280 కోట్ల డాలర్లు వెళ్లగా, పోలాండ్ 210 కోట్లు, ఫ్రాన్స్ 190 కోట్లు, ఇటలీ 130 కోట్ల డాలర్లు అందుకున్నాయి. బాగా చదువుకున్న పాశ్చాత్య దేశాల నుంచే కాకుండా పేద దేశాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్న సౌదీ అరేబియా నుంచే అమెరికా తర్వాత ఎక్కువ మొత్తం ఆర్థిక వనరులు వలసదారుల మాతృదేశాలకు తరలిపోతున్నాయి. 2015 సంవత్సరంలో సౌదీ నుంచి 4,570 కోట్ల డాలర్లు తరలిపోగా, లెబనాన్ 140 కోట్లు, మయన్మార్ 95.40 కోట్లు, సిరియా 47.40 కోట్ల డాలర్లు అందుకున్నాయి.
ఇలా వలసదారుల నుంచి అందిన సొమ్మును వారి బంధువులు ఎక్కువగా తిండి, ఇంటి అవసరాలకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ మొత్తాలు ఓ దేశం అధికారికంగా అందించే ఆర్థిక సహాయంకన్నా ఎక్కువగాను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకన్నా తక్కువగాను ఉంటున్నాయి.
2015 లో అమెరికా నుంచి ఇతర దేశాలకు బదిలీ అయిన డబ్బు $ 133,552,000,000
2015 లో జర్మనీ నుంచి ఇతర దేశాలకు బదిలీ అయిన డబ్బు $ 22,861,000,000
2015 లో సౌదీ అరేబియా నుంచి ఇతర దేశాలకు చేరిన డబ్బు $ 45,739,000,000