
రూ.500 నోట్ల కట్టలు(ఫైల్ ఫొటో)
కోయంబత్తూరు: ప్రమాదానికి గురైన కారు కరెన్సీ కట్టలతో నిండిఉంది. కోయంబత్తూరు సమీపం సేలం-కొచ్చి జాతీయ రహదారిలో పోడిపాళయం గ్రామ సమీపంలో బుధవారం ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదంలో కారు తలుపులు తెరుచుకోగానే అందులో నుంచి 500, వెయ్యా రూపాయల నోట్ల కట్టలు నేలపై పడ్డాయి. అది చూసిన బస్సు డ్రయివర్, ప్రయాణికులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కారును సోదా చేశారు.
సేలం నుంచి కేరళలోని మలప్పురం వెళుతున్న ఈ కారు తలుపుల్లోనూ, సీటులో స్పాంజికి బదులుగా, లగేజీ పెట్టుకునేచోట నోట్ల కట్టలు దొరికాయి. ఈ మెత్తం 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉండవచ్చని పోలీసుల అంచనా. పోలీసులు సమాచారం అందించడంతో ఇన్కమ్ టాక్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.