న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘భారత్‌లో తయారీ’లో భాగంగా దేశీ తయారీని ప్రోత్సహించే చర్యలను ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. పది రంగాలకు సంబంధించి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచారు. చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులను నియంత్రించడంతోపాటు, దేశీయంగా ఉపాధిని పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. సిల్క్ ఫ్యాబ్రిక్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఇది 10 శాతం ఉండగా దీన్ని 20 శాతంగా బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే ఈ చర్యను సిల్క్ ఎగుమతిదారుల సమాఖ్య మాత్రం వ్యతిరేకించింది. ఎగుమతులపై ఇది ప్రభావం చూపిస్తుందని సమాఖ్య చైర్మన్ సతీష్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, మొబైల్ ఫోన్లపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం చేశారు. మొబైల్ యాక్సెసరీలపై 7.5 శాతం నుంచి 15 శాతానికి, టీవీలపైనా 15 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. కొత్తగా చార్జింగ్ అడాప్టర్లపై 10 శాతం సుంకం ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పళ్లరసాలపై భారీగా పెంచారు. కాన్‌బెర్రీ జ్యూస్‌పై ఐదు రెట్లు పెంచి 50 శాతం చేశారు. అన్ని రకాల పళ్ల, కూరగాయల జ్యూస్‌పైనా 30 నుంచి 50 శాతం చేశారు. సిల్క్ ఫ్యాబ్రిక్స్ మాదిరే పాదరక్షలపైనా దిగుమతి సుంకాన్ని 20 శాతానికి పెంచారు. ఫర్నిచర్, ల్యాంపులు, కళ్లద్దాలు, కొవ్వొత్తులు, పతంగులు, లైటర్లు, సెంట్ స్ప్రేయర్లు, పెర్‌ఫ్యూమ్‌లు, గడియారాలు, ఆట వస్తువులపైనా రెట్టింపైంది. ఆటోమొబైల్ విడిభాగాలు, కొన్ని రకాల యాక్సెసరీలు, మోటారు కార్లు, మోటారు సైకిళ్లపై 7.5–10 శాతం మధ్య పన్ను ఉండగా దాన్ని 15 శాతానికి పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment