సాక్షి, ముంబై : రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతుండడంతో వీటిని నివారించేందుకు నగర పోలీసులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నగర్ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో ఉన్న 93 పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ సెల్‌లను ఏర్పాటుచేయనున్నామన్నారు. నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపుచేయడమే ధ్యేయంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశంతో ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
వీటికోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తామని, వారికి ల్యాబ్‌టాప్, ఇంటర్‌నెట్ కనెక్షన్‌తోపాటు ఇతర సదుపాయాలను కల్పిస్తామన్నారు. మరో 15 రోజుల్లో ఈ సైబర్ సెల్‌లను ప్రతి పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేయనున్నట్లు మారియ పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని సైబర్ నేరాలనూ బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ సెల్ ద్వారా దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా, ఇది పోలీసులకు అదనపు భారంగా పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సెల్‌కు సబ్ ఇన్‌స్పెక్టర్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రతి పోలీస్‌స్టేషన్ సైబర్ నేరాలను స్వయంగా ఎదుర్కోవాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేసినట్లు మారియ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సెల్‌లో ఒక అధికారితోపాటు ఇద్దరు లేదా ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు. ఈ సైబర్ సెల్‌లో పనిచేయడానికి ఎవరు ఆసక్తి కనబరుస్తున్నారో.. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని మారియ పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపి)ను ఎదుర్కోవడానికి సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. దీంతో వారు సాఫ్ట్‌వేర్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన తర్వాత నేరస్తులను సులువుగా ట్రేస్ చేయవచ్చని మారియ అభిప్రాయపడ్డారు.
పోలీస్‌స్టేషన్లలో ‘సైబర్ సెల్’
Published Sat, Nov 22 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement