గోయల్‌కు రైల్వే.. సురేశ్ ప్రభుకు వాణిజ్యం
- అనూహ్యంగా శాఖల కేటాయింపులు
- కొత్త వారిలో ముగ్గురికి స్వతంత్ర, మిగిలిన వారికి సహాయ హోదాలు
- 2019 ఎన్నికలు, రాజకీయ వ్యూహంతోనే శాఖల కేటాయింపు
న్యూఢిల్లీ: సంచలనాలు, అనూహ్య నిర్ణయాలకు పెట్టిందిపేరైన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ద్వయం ఆదివారం నాటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ తమ మార్కును చూపింది. సరిగ్గా పనిచేసే మంత్రులకు సరైన గౌరవం దక్కుతుందని తరచూ చెబుతున్న ప్రధాని.. వాణిజ్య శాఖ (స్వతంత్ర) మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు ఏకంగా చాలా కీలకమైన రక్షణ శాఖను కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మలా సీతారామన్ భారత రక్షణ శాఖకు తొలి పూర్తిస్థాయి మహిళా మంత్రిగా నిలిచారు. అంతకుముందు 1970ల్లో ఇందిరా గాంధీ ప్రధానిగా రక్షణ శాఖను తనే నిర్వహించారు.
నిన్నటి వరకు స్వతంత్ర మంత్రులుగా ఉన్న పీయూష్ గోయల్ (రైల్వే), ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం), ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (మైనారిటీ వ్యవహారాలు)లకూ కేబినెట్ హోదాతో ప్రమోషన్ కల్పించారు. పలువురు సీనియర్ మంత్రుల శాఖల్లోనూ భారీగానే మార్పులు చేశారు. కొత్తగా చేరిన తొమ్మిది మంది మంత్రులకు స్వతంత్ర, సహాయ హోదాలు కల్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ ముఖ్యనేతలు, పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, కొత్త మంత్రుల్లో అల్ఫోన్స్ కణ్ణాంథనం, హర్‌దీప్ సింగ్ పురీలు ఎంపీలు కాదు. ఆర్నెలల్లో వీరు పార్లమెంటుకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ విస్తరణలో ఎన్డీయేలోని ఇతర పక్షాలకు చోటు కల్పించకపోవటం గమనార్హం.
భారీగా మార్పులు
తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖను కేటాయించటమే అత్యంత ఆసక్తికర మార్పు. దీనిపై బీజేపీతోపాటుగా వివిధ పార్టీల్లో, రాజకీయ విశ్లేషకుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది. కేబినెట్ ప్రమోషన్ దొరికినా.. నిర్మలకు రక్షణ మంత్రిగా బంపర్ బొనాంజా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రెల్వే శాఖకు రాజీనామా చేసిన సురేశ్ ప్రభుకు వాణిజ్య, పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు. మొదట సురేశ్ ప్రభుకే రక్షణ శాఖ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రిగా మంచిపేరు తెచ్చుకున్న పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖను అప్పగించారు. రైల్వేతోపాటు బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా గోయల్ వద్దే ఉంది. కేబినెట్ ప్రమోషన్ పొందిన ధర్మేంద్ర ప్రధాన్‌కు గతంలో ఉన్న పెట్రోలియం శాఖకు అదనంగా నైపుణ్యాభివృద్ధి బాధ్యతలిచ్చారు.
ఉమ బాధ్యతలు గడ్కారీకి
రోడ్లు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కారీకి ఉమాభారతి నిర్వహించిన గంగానది పునరుజ్జీవం, జలవనరుల శాఖను అదనంగా కేటాయించారు. నమామి గంగే ప్రాజెక్టుకోసం భారీగా నిధులు కేటాయించినా అనుకున్న పని జరగకపోవటంతో ఉమాభారతిపై మోదీ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమాభారతి కేబినెట్ హోదా ఉన్నా.. ప్రాధాన్యం లేని తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కేబినెట్ హోదా కల్పిస్తూ మైనారిటీ వ్యవహారాల శాఖ పూర్తి బాధ్యతలు అప్పగించారు. మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో మైనారిటీ నేత లేకపోవడంతో నఖ్వీకి ప్రమోషన్ దొరికింది. దివంగత మంత్రి అనిల్ దవే నిర్వహించిన పర్యావరణ శాఖ బాధ్యతలను కేబినెట్ మంత్రి హర్షవర్ధన్‌కు అదనంగా కేటాయించారు.
ఇరానీకీ అందలం
వెంకయ్యనాయుడు రాజీనామా తర్వాత సమాచార, ప్రసార శాఖ తాత్కాలిక మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీకి ఆ శాఖ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటుగా జౌళి శాఖ బాధ్యతలు కూడా ఇరానీ వద్దే ఉన్నాయి. విజయ్ గోయల్ నుంచి క్రీడలు, యువజన సర్వీసుల శాఖను రాజ్‌వర్ధన్ సింగ్ రాథోడ్ (స్వతంత్ర)కు అప్పగించారు. సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా కూడా రాథోడ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గోయల్‌కు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా, గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిగా ప్రధాని నిర్ణయించారు. సంతోశ్ గంగ్వార్‌కు దత్తాత్రేయ నిర్వహించిన కార్మిక, ఉపాధి శాఖ బాధ్యతలు, గిరిరాజ్ సింగ్‌కు చిన్న, మధ్య తరహా పరిశ్రమల బాధ్యతలు అప్పగించి ప్రమోషన్ ఇచ్చారు.
కొత్త మంత్రుల బాధ్యతలు
మాజీ దౌత్యవేత్త హర్‌దీప్ పురీ, మాజీ ఐఏఎస్ అల్ఫోన్స్ కణ్ణాంథనం, మాజీ హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌లు తాజా విస్తరణలో స్వతంత్ర హోదాలో మంత్రులుగా నియమితులయ్యారు. అల్ఫోన్స్‌కు పర్యాటక శాఖ, పురీకి గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు. వెంకయ్యనాయుడు నిర్వర్తించిన శాఖలను పురీకి అప్పగించారు. ఆర్కే సింగ్‌కు విద్యుత్, పునరుత్పాదక మంత్రిత్వ శాఖ బాధ్యతలు ఇచ్చారు. మిగిలిన ఆరుగురు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. మాజీ ముంబై కమిషనర్ సత్యపాల్ సింగ్‌ను మానవ వనరుల అభివృద్ధి, జల వనరులు, గంగా పునరుజ్జీవ శాఖల సహాయ మంత్రిగా మోదీ నిర్ణయించారు. శివ ప్రతాప్ శుక్లా ఆర్థిక శాఖ, అశ్విని కుమార్ చౌబే వైద్యం, వీరేంద్ర కుమార్ మహిళా శిశుసంక్షేమం, అనంత్ హెగ్డే నైపుణ్యాభివృద్ధి, గజేంద్ర సింగ్ షెకావత్ వ్యవసాయ శాఖలకు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు.
కుల సమీకరణాలతో పక్కాగా!
కేరళలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. మాజీ ఐఏఎస్ అధికారి అల్ఫోన్స్ (క్రిస్టియన్)కు స్వతంత్ర హోదా ఇచ్చింది. విద్యావంతులు, క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న కేరళలో అల్ఫోన్స్ ఎంపిక పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ ఆలోచన. నఖ్వీకి కేబినెట్‌లో, అల్ఫోన్స్‌ను మంత్రి మండలిలో తీసుకోవటం ద్వారా మైనారిటీలను ఆకట్టుకోవాలనేది మోదీ వ్యూహంగా కనబడుతోంది.
ఎన్డీయే చచ్చిపోయింది: శివసేన
మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించకపోవటంపై శివసేన మండిపడింది. ‘ఎన్డీయే దాదాపు చచ్చిపోయింది. కూటమి పార్టీల సమావేశానికే అది పరిమితమైంది. ప్రభుత్వంలో మా పాత్రే లేదు. పార్లమెంటులోనో, రాష్ట్రపతి ఎన్నికప్పుడో.. మా మద్దతు అవసరమైనప్పుడే మేం బీజేపీకి గుర్తొస్తాం’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. కాగా, మాజీ అధికారులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవటాన్ని కాంగ్రెస్ విమర్శించింది. ‘కేంద్ర మంత్రి మండలిని వయోవృద్ధుల క్లబ్‌గా మార్చేశారు. దేశంలో సగటు యువత వయసు 27 అయితే.. సగటు మంత్రి వయసు 60.44’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ఎద్దేవా చేశారు.
అప్పుడు అడ్వాణీని అరెస్ట్ చేశారు!
బీజేపీ అగ్రనాయకుడు అడ్వాణీని ఒకప్పుడు అరెస్టు చేసిన ఐఏఎస్ అధికారి నేడు మోదీ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. ఆయనే రాజ్ కుమార్ సింగ్. 1990లో అడ్వాణీ రథయాత్ర చేపట్టిన సమయంలో బిహార్‌లో పనిచేస్తున్న సింగ్...సమస్తీపూర్‌లో అడ్వాణీని అరెస్టు చేశారు. అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతిస్తుండేది. అడ్వాణీ అరెస్టుతో వీపీ సింగ్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలోనే బీజేపీ బలమైన పార్టీగా ఎదిగింది. అనంతరం అడ్వాణీ హోం మంత్రిగా ఉండగా రాజ్ కుమార్ సింగ్ ఆ శాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2013లో రాజకీయాల్లోకి వచ్చి 2014లో ఎంపీ అయ్యారు.
పాలన + రాజకీయం = తాజా మార్పులు
పాలనాపరమైన మార్పులతోపాటుగా 2019 సార్వత్రిక, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగానే పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. పనితీరు సరిగాలేని మంత్రులతో రాజీనామా చేయించటం ద్వారా.. తమ ప్రభుత్వం సుపరిపాలనపైనే దృష్టిపెట్టిందని ప్రధాని మోదీ చెప్పే ప్రయత్నం చేశారు. మాజీ అధికారులను మంత్రివర్గంలోకి తీసుకోవటమూ ఇందులో భాగంగానే అని అర్థమవుతోంది. నిర్మలా సీతారామన్ బలమైన రాజకీయ నేత కానప్పటికీ.. దక్షిణభారతంలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగానే కీలక రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎల్పీజీ సబ్సిడీ తొలగించటం, పేదలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను సమకూర్చటం విషయాల్లో ప్రశంసలు అందుకున్న పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కేబినెట్ హోదా ఇవ్వటం ద్వారా 2019 ఎన్నికల్లో ఒడిశాలో పార్టీని మరింత బలోపేతం చేయాలనేది మోదీ ఆలోచన. అమిత్ షా రచిస్తున్న ఒడిశా వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు జరిగినట్లు స్పష్టమవుతోంది.
ఆనందంతో మాటలు రావట్లేదు: నిర్మలా సీతారామన్
‘ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. అమిత్‌షా, మంత్రివర్గ సీనియర్లు గడ్కారీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్‌లకు ధన్యవాదాలు. ఇకపై సీసీఎస్ (కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ)లో ఇద్దరు మహిళలు ఉండబోతున్నారు. ఇది కీలక నిర్ణయం. నన్ను నమ్మి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. సర్వశక్తులూ ఒడ్డి పనిచేస్తా’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ కూడా నిర్మలే కావడం విశేషం. నిన్నటి వరకు వాణిజ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించిన నిర్మలా సీతారామన్ తాజా విస్తరణలో రక్షణ శాఖకు ప్రమోషన్ పొందారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించడంపై స్పందించేందుకు మాటలు రావడం లేదని ఆమె పేర్కొన్నారు.
మదురై నుంచి మహిళా రక్షణ మంత్రి వరకు..
తమిళనాడులోని మదురైలో 1959లో మధ్యతరగతి కుటుంబంలో నిర్మలా సీతారామన్ జన్మించారు. తల్లి సావిత్రి, తండ్రి నారాయణన్ సీతారామన్ రైల్వే ఉద్యోగి. తిరుచురాపల్లిలో బీఏ ఎకనమిక్స్.. ఢిల్లీ జేఎన్‌యూలో ఎకనమిక్స్‌లో ఎమ్మే, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు. అనంతరం లండన్‌లోని అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్, ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్, బీబీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. 2003–2005లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న సమయంలో సుష్మా స్వరాజ్‌తో పరిచయం కారణంగా బీజేపీ వైపు ఆకర్శితులయ్యారు. 2006లో ఈమె బీజేపీలో చేరారు.
2010లో నితిన్ గడ్కారీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ఈమె పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి మృతితో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు టీడీపీ సాయంతో ఆమె ఎంపికయ్యారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఈమె భర్త పరకాల ప్రభాకర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉన్నారు. వీరికి ఓ కూతురు. ఈమె ఢిల్లీలో జర్నలిస్టు. నిర్మలకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. కుటుంబం ప్రోత్సాహం కారణంగానే ఈ స్థాయికి ఎదిగానని ఆమె చెబుతారు. హైదరాబాద్‌లోని ప్రణవ స్కూల్ వ్యవస్థాపక డైరెక్టర్లలో నిర్మలా సీతారామన్ ఒకరు.