ప్రధానికి ఢిల్లీ సీఎం నాలుగు సలహాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి సలహాలు ఇచ్చారు. జేఎన్యూ వివాదం సర్దుమణిగేందుకు నాలుగు సలహాలు ప్రధానికి సూచించారు. వాటిని అమలుచేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయన చెప్పారు. దేశద్రోహం ఆరోపణలతో జేఎన్యూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి కన్హయ్య కుమార్ అరెస్టు నేపథ్యంలో జేఎన్యూ ప్రాంగణం వివాదాలకు నిలయమైన విషయం తెలిసిందే.
కన్నయ్యను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టు ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం పేరిట కేజ్రీవాల్ నాలుగు సూచనలు ప్రధానికి తెలియజేస్తూ ఓ లేఖ రాశారు. అందులో ఏం పేర్కొన్నారంటే
1. విద్యార్థిపై దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను అరెస్టు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి.
2. అరెస్టుచేసిన విద్యార్థి నాయకుడుకన్హయ్యకుమార్ ను వెంటనే విడుదల చేయాలి.
3. జేఎన్యూలో రాజకీయ జోక్యాన్ని నిలిపేయాలి.
4. ప్రజలకు ఢిల్లీ పోలీసులపై నమ్మకం కలిగించే చర్యలు తీసుకోవాలి.
ఈ చర్యలు తీసుకోవడం ద్వారా జేఎన్యూ వివాదం సర్దుమణుగుతుందని చెప్పారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున జేఎన్యూ వివాదం విషయంలో పోలీసులు విఫలమయ్యారని, వారి విఫలం కేంద్ర వైఫల్యంగానే భావిస్తున్నానని అందులో చెప్పారు.