సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై తుది తీర్పు వెల్లడించేందుకు ఢిల్లీ హైకోర్టు సిద్ధమైంది. రేపు (సోమవారం) ఉదయం 10 గంటల తరువాత ఉన్నావ్ అత్యాచార కేసుపై తీర్పును వెల్లడించనుంది. కేసులో పూర్తి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ ధర్మేశ్ శర్మ తెలిపారు. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కాగా 2017లో కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 2018లో ఉన్నావ్‌కు చెందిన యువతి ఆరోపించగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి లాకప్‌లోనే ఆయన చనిపోయేలా చేయడం తెలిసిందే. బాధిత యువతి తన ఇద్దరు సమీప బంధువులు, లాయర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారును ట్రక్కుతో ఢీకొట్టి వారందరినీ చంపే ప్రయత్నం జరిగింది. యువతి బంధువులైన ఇద్దరు మహిళలు మరణించగా, యువతి, ఆమె లాయర్ తీవ్ర గాయాలపాలై.. తృటిలో తప్పించుకున్నారు. ప్రమాద ఘటనపై విచారణన చేపట్టిన సీబీఐ, 10 మందిపై హత్యానేరం మోపింది.
కాగా కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తులు సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని భావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అత్యాచార ఘటనకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఐదు కేసులనూ ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలని గత ఆగస్ట్‌లో సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 120 బీ (క్రిమినల్ కుట్ర), 363 కిడ్నాప్, 376 అత్యాచారం, పోక్సో చట్టం వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంగార్‌ను బీజేపీ ఇదివరకే పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment