
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీలోని చతార్పూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేర్ సెంటర్‌లో 10 వేల పడకలు ఉన్నాయి. దీనికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అని నామకరణం చేశారు. ఇక్కడ అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటలేటర్లు, ఐసీయూను అనిల్ బైజాల్ పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ‘ఆపరేషన్ కరోనా వారియర్స్’ పేరిట ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందిస్తోంది.
1,700 అడుగుల పొడవు, 700 అడగుల వెడల్పు ఉన్న ఈ కేర్ సెంటర్‌లో 200 ఎన్‌క్లోజర్లు ఉన్నాయి. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు. మొత్తం సెంటర్‌లో 20 ఫుట్‌బాల్ ఆట స్థలాలను ఇమడ్చవచ్చు. మరో 200 పడకలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం ఇంకా మిగిలి ఉంది. లక్షణాలు కనిపించని, లక్షణాలు కనిపించే.. ఇలా రెండు రకాల కరోనా బాధితులకు ఇక్కడ వేర్వేరుగా సేవలందిస్తారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో డీఆర్‌డీఓ నిర్మించిన 1,000 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు సందర్శించారు.