యూట్యూబ్ వీడియోలు చూసి గంగలో మునక
న్యూఢిల్లీ: వారంతా ఢిల్లీ వాసులు. యూట్యూబ్‌లో వచ్చే సాహసోపేతమైన క్రీడలకు సంబంధించిన వీడియోలు చూసి తాము చేయగలమని ఒక అంచనాలేని స్ఫూర్తిని పొందారు. అనుకున్నదే తడవుగా రోడ్డు ట్రిప్‌కు వెళ్లిన వారు గంగా నదిలో ఓ 20 కిలో మీటర్లపాటు ర్యాప్టింగ్‌కు వెళ్లి బోటు తిరగలపడటంతో ప్రమాదంలో పడ్డారు. మొత్తం ఆరుగురు గంగా నదిపై బోటు షికారుకు వెళ్లగా వారిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సుభాష్ కుమార్(35) అనే వ్యక్తి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సుభాష్ కుమార్ అతడి అయిదుగురు సోదరులు ప్రొఫెషనల్స్.
సరదాగా రోడ్డు ట్రిప్‌కు వెళ్లిన వారు గంగా నదిలో ర్యాప్టింగ్‌కు వెళ్లాలనుకున్నారు. వారికి ఈత కూడా సరిగా రాదు. శివపురి నుంచి రామ్‌లీలా వరకు ర్యాప్టింగ్‌కు వెళ్లాలని భావించిన వారు ఇద్దరు గైడ్లను తమ బోటులో ఎక్కించుకున్నారు. వారితోపాటు మరో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇలా మొత్తం 11మంది ఆ బోటులో ఎక్కి షికారుకు వెళుతుండగా నది ఉదృతంగా ప్రయాణించే ఓ చోట దానిని నిర్వహించలేకపోవడంతో ఆ బోటు బోర్లా పడింది.
అయితే, వెనుక మరో బోటులో వచ్చిన వారు నదిలో పడ్డవారిని రక్షించారు. అయితే, అప్పటికే సుభాష్ కుమార్ నీళ్లు ఎక్కువగా తాగడంతో ప్రాణాలుకోల్పోయాడు. కాగా, వారితోపాటు ఎక్కిన గైడ్లలో ఒకరు సుక్షితుడు కాదంట. పైగా అతడికి పదిహేనేళ్లనట. వీడియో తీసేందుకు డబ్బులు మాట్లాడుకునే విషయంలో గొడవ వచ్చి కావాలనే అతడు బోటును నియంత్రణ చేసే విషయంలో సహాయం చేయలేదని, ఫలితంగా ప్రమాదం జరిగిందని సుభాష్ సోదరుడు విజయ్ అనే వ్యక్తి చెప్పాడు.