
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. పటిష్ట చర్యలు చేపడుతున్నా కరోనా కేసులు రోజురోజుకీ విజృంభిస్తున్న తరుణంలో మంగళవారం(ఏప్రిల్ 14)న ముగియాల్సిన లాక్‌డౌన్‌ను పొడగించే అంశమై ప్రధాని నరంద్ర మోదీ రేపు కీలక ప్రకటన చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ అధికారినని నాటకమాడి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతడిని అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలో చోటుచేసుకుంది.(లాక్‌డౌన్: అడ్డొచ్చిన పోలీసు చేయి నరికేశాడు!)
వివరాలు.. సోమవారం ఓ 29 ఏళ్ల వ్యక్తి కారులో బయల్దేరాడు. పోలీసు బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని అడ్డగించిన పోలీసులకు తాను 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారినని చెప్పాడు. ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నానని.. కారుపై ఉన్న స్టిక్కర్లను చూపించాడు. అంతేగాక పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెబుతూ వారిని బెదిరించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. నకిలీ అధికారి అని ధ్రువీకరించి అరెస్టు చేశారు. కారును సీజ్ చేశారు. ఇక గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. తాను ప్రభుత్వోద్యోగినని అబద్ధం చెప్పి.. ఓ వ్యక్తి తన భార్య, కూతురితో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో చిన్నారికి కరోనా సోకడంతో తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.(ఈ పరిస్థితుల్లో అలా ఆదేశించలేం: సుప్రీంకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment