బుక్కయిన దినకరన్.. బిగుస్తున్న ఉచ్చు
చెన్నై: తమిళనాడు రాజకీయాలు నిత్యం ఉత్కంఠగా మారుతున్నాయి. రోజుకోమలుపు తిరుగుతున్నాయి. శశికళ వర్గానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ బుక్కయ్యారు. ఆయనపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు ఆకులు అన్నాడీఎంకే పార్టీ గుర్తు అనే విషయం తెలిసిందే. దీనికోసం పన్నీర్ వర్గం, శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు లాబీయింగ్‌లు చేస్తున్నారు.
అయితే, దినకరన్ మాత్రం ఏకంగా ఆ గుర్తు తమకే వచ్చేలా చూడాలని చెప్పి రూ.50కోట్ల ఒప్పంద చేసుకొని సుఖేశ్ చంద్ర అనే మధ్యవర్తి ద్వారా ఈసీకి లంచం ముట్టజెప్పేందుకు ప్రయత్నం చేశారని తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే సుఖేశ్ చంద్రకు రూ.కోటి 39లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసుల చేతికి చిక్కడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అతడి వద్ద నుంచి రూ.కోటి39లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికల సంబంధించి పెద్ద మొత్తంలో ఓటర్లను ప్రభావితం చేశారని దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా దినకరన్ నేడు శశికళను కలవబోతున్నారు.