- ఏబీవీపీ దాడులకు నిరసనగా యువతి పోరాటం
- మద్దతుగా నిలబడుతున్న దేశ యువత
- సోషల్ మీడియాలో వైరల్‌గా ఆమె ప్రొఫైల్ పిక్
- చంపుతామని, రేప్ చేస్తామని బెదిరింపులు
- భయపడనంటున్న లేడీ శ్రీరాం విద్యార్థిని
- మంగళవారం నిరసన ర్యాలీకి పిలుపు
స్వతంత్ర భావాలున్న ఓ 24 ఏళ్ల యువతి ఆమె. స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే హక్కు తనకుందని, తననెవరూ భయపెట్టలేరని అంటోంది. వ్యతిరేక గళమే వినపడకూడదనే ఫర్మానాలను లెక్కచేయనంటోంది. ముప్పేటదాడి జరుగుతున్నా, బెదిరింపులు వస్తున్నా... ధైర్యంగా నిలబడి పోరాడుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడామె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పేరు గుర్‌మెహర్ కౌర్. ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజి విద్యార్థిని. భిన్న అభిప్రాయాలకు, భావజాలానికి చోటులేదనే రీతిలో ఢిల్లీ వర్శిటీల్లో ఏబీవీపీ కనబరుస్తున్న ఆధిపత్య ధోరణిపై, చేస్తున్న దాడులపై సోషల్ మీడియా కేంద్రంగా పోరాటం చేస్తోంది. ‘నేను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని. ఏబీవీపీకి భయపడను. నేను ఒంటిరిని కాదు. భారత్‌లోని ప్రతి విద్యార్థి, విద్యార్థిని నాకు తోడుగా ఉన్నారు’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని ఫోటో దిగింది. ‘డీయూ వీటిని తిప్పికొట్టాలి. ‘ఏబీవీపీకి వ్యతిరేకంగా విద్యార్థులు’ అనే హ్యాష్‌టాగ్‌తో ఫేస్‌బుక్‌లో తన ప్రొఫైల్ పిక్చర్ కింద పెట్టింది.
రాంజాస్ కాలేజీలో గత బుధవారం ఏబీవీపీ దాడులకు దిగిన కొద్ది గంటల్లో గుర్‌మెహర్ దీన్ని పోస్ట్ చేసింది. అమాయకులైన విద్యార్థులపై ఏబీవీపీ అంత దారుణంగా దాడి చేయడం కలచివేస్తోంది. ఇవి ఆగాలి. ఇది నిరసనకారుల మీద దాడి కాదు... ప్రజాస్వామ్య విలువలపై దాడి. ఈ దేశ పౌరుల స్వేచ్ఛపై, భావాలపై, విలువలపై, హక్కులపై జరిగిన దాడి... అని గుర్‌మెహర్ అభివర్ణించింది. ఆమె తోటి విద్యార్థులు గుర్‌మెహర్ ఏబీవీపీ వ్యతిరేక వ్యాఖ్యలతో ఉన్న ఫోటోను తమ ప్రొఫైల్ పిక్ కింద పెట్టుకొని మద్దతు పలికారు.
అప్పటినుంచి ఇది వైరల్ అయింది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది.. వేలమంది తమ ఫ్రొఫైల్ పిక్‌ను మార్చేసి గుర్‌మెహర్ ఫోటోను పెట్టుకున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఆమెపై దాడి మొదలైంది. చంపేస్తామని, రేప్ చేస్తామని.. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. ట్విటర్‌లో ఆమెను దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. తనకు వచ్చిన బెదిరింపులపై సోమవారం గుర్‌మెహర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయించింది. ఆమెకు భద్రత కల్పించాలని మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ కూతురు గుర్‌మెహర్. భారత్-పాక్‌ల మధ్య శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని చెబుతూ గతంలో ఆమె ‘పాకిస్తాన్ మా నాన్నను చంపలేదు. యుద్ధం చంపింది’ అనే పోస్ట్‌ను పెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు సోమవారం దీన్ని రీపోస్ట్ చేస్తూ... ‘ఈ అమ్మాయి బుర్రను పాడుచేస్తోంది ఎవరు? బలమైన సైనిక సంపత్తి ఉంటేనే యుద్ధం రాదు. భారత్ ఎప్పుడూ ఇతరులపై దాడి చేయలేదు. కానీ బలహీనంగా ఉన్నపుడల్లా భారత్‌పై దండయాత్రలు జరిగాయి’ అని ట్వీట్ చేశారు.
స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించిన... ఎవరికీ భయపడబోనని చెప్పిన ఓ సాధారణ కాలేజీ అమ్మాయి జోలికి, అదీ అమరవీరుడి కూతురని కూడా చూడకుండా వెళ్లాల్సిన అవసరం రిజిజుకు ఏమిటి? ఆమె గతంలో ఎప్పుడో పెట్టిన పోస్ట్ వెతికితీసి... వక్రభాష్యం చెబుతూ ఆమె వెనక ఎవరో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేయడం ఓ కేంద్రమంత్రికి తగినదేనా? జేఎన్‌యూలో కన్హయ్య అరెస్టు, గొడవలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య-ఏబీవీపీ పాత్ర, వీసీ అప్పారావుపై కేసు అసలు కదలకపోవడం... ఇవన్నీ చూస్తుంటే అధికారం అండతోనే ఏబీవీపీ రెచ్చిపోతోందని విశ్లేషకుల అభిప్రాయం. వర్శిటీల కాషాయీకరణ అజెండా అమలవుతోందనే విమర్శలు కూడా గతంలో చాలానే వచ్చాయి.
వీరూ... హిట్ వికెట్
సాధారణంగా సందర్భానుసారంగా, హాస్యస్పోరకంగా ట్వీట్లు పెట్టే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ట్వీటర్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. పంచ్‌లతో కూడిన అతని ట్వీట్లు బాగా పేలుతాయి. అయితే వీరూ సోమవారం అనవసరంగా దీంట్లో వేలుపెట్టి విమర్శల పాలయ్యాడు. గుర్‌మెహర్ పేరు ఎక్కడా ఎత్తకున్నా... ఆమెలాగే ప్లకార్డు పట్టుకొని దానిపై ‘నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. వాటిని నా బ్యాట్ చేసింది’ అని ఫోటోదిగి ట్వీట్ చేశారు. దీన్ని సినీ నటుడు రణ్‌దీప్ హుడా రీట్వీట్ చేయడంతో ఇద్దరిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వీరూ స్థాయికి ఇలాంటివి తగవని, హింసను ధైర్యంగా ఎదుర్కొంటున్న ఓ యువతిని హేళన చేయడమేమిటని దుయ్యబట్టారు.
దాంతో రణ్‌దీప్ తగ్గాడు. ‘పాపం అభం శుభం తెలియని అమ్మాయిని రాజకీయంలో ఓ పావుగా వాడుకుంటున్నారు’ అని ట్వీట్ చేశాడు. దీనికి గుర్‌మెహర్ దీటుగా బదులిచ్చింది... ‘రాజకీయ పావునా? ఆలోచిస్తా. విద్యార్థులపై దాడులను నేను సమర్థించను. అది తప్పా? అని నిలదీసింది. ప్రముఖ జర్నలిస్టులు బర్కాదత్, శేఖర్ గుప్తాలు ... గుర్‌మెహర్‌కు అండగా నిలిచారు. సెహ్వాగ్, రణ్‌దీప్‌లను తప్పుబట్టారు. ‘ఆమె లోకం తెలియనిది కాదు. పావు అంతకన్నా కాదు. తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా వెల్లడించే పరిణితిగల యువతి’ అని శేఖర్ గుప్తా ట్వీట్ చేశారు.
బీజేపీకి చెందిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ అయితే ’1993లో జనాన్ని నేను చంపలేదు. బాంబులు చంపాయి’ అని రాసున్న ప్లకార్డును మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం పట్టుకున్నట్లుగా ట్వీట్ చేసి... గుర్‌మెహర్‌ను హేళన చేశారు. దీనిపై కూడా నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీరు ఎవరైనా సరే, ఏ సంస్థకు చెందిన వారైనా... ఓ అమ్మాయిని రేప్ చేస్తామని బెదిరించలేరు. ఇది మహిళల కోసం చేస్తున్న పోరాటం. మంగళవారం ఖల్సా కాలేజీ నుంచి నిరసన ర్యాలీ చేపడతాం’ అని మహిళా కమిషన్‌ను కలిసిన తర్వాత గుర్‌మెహర్ వెల్లడించింది.
ఎక్కడ మొదలైంది...
ఢిల్లీ యూనివర్శిటీలోని రాంజాస్ కాలేజీలో ఈనెల 21, 22 తేదీల్లో ‘కల్చర్స్ ఆఫ్ ప్రొటెస్ట్’ పేరిట సెమినార్‌ను ఏర్పాటు చేసింది ఆ కాలేజీకి చెందిన సాహిత్య సొసైటి. దీనికి జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి ఉమర్ ఖాలిద్‌ను, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ ఉపాధ్యక్షురాలు షేహ్లా రషీద్‌ను మాట్లాడటానికి ఆహ్వానించింది. కిందటి ఏడాది అప్పటి జేఎన్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, మరో పరిశోధక విద్యార్థి అనిర్బన్ భట్టాచార్యలతో పాటు ఉమర్ ఖాలిద్‌ను దేశద్రోహం అభియోగాలపై పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టు వీరిపై అభియోగాలను కొట్టివేసింది. అప్పట్లో జేఎన్‌యూలో జరిగిన నిరసనల్లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఉమర్, షేహ్లా రషీద్‌లు దేశద్రోహులని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆరోపణ.
అందుకే రాంజాస్ కాలేజీకి వీరిని పిలవడాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. నిరసనలకు దిగింది. ఒత్తిడికి తలొగ్గిన రాంజాప్ కాలేజీ ప్రిన్సిపల్ వీరిద్దరికీ ఆహ్వానాలను ఉపసంహరించారు. పోలీసులు కూడా తాము ఉమర్‌కు రక్షణ కల్పించలేమని చేతులెత్తేశారు. దీన్ని వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూలు తప్పుపట్టాయి. అభిప్రాయాలను వెల్లడించుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, దేశభక్తి పేరిట బల ప్రదర్శనకు దిగి ఏబీవీపీ తమ గొంతు నొక్కాలని చూస్తోందని షేహ్లా రషీద్ అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు గత బుధవారం దాడులకు దిగారు. రాంజాస్ కాలేజీపైకి రాళ్లురువ్వారు. భౌతిక దాడి చేయడంతో ముగ్గురు ప్రొఫెసర్లు, మీడియా ప్రతినిధులు పలువురు గాయపడ్డారు. గడిచిన ఐదారు రోజులుగా ఢిల్లీ యూనివర్శిటీ వైరి విద్యార్థి సంఘాల పోటాపోటీ నిరసనలతో హోరెత్తుతోంది. వర్శిటీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ జాతీయ పతాకంతో ఏబీవీపీ సోమవారం యూనివర్శిటీలో ర్యాలీ నిర్వహించింది.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్