న్యూఢిల్లీ: యువత దేశానికి వెన్నుముక అన్నారు పెద్దలు. దేశ భవిష్యత్‌ను తీర్చి దిద్దేది యువతరం. అలాంటి యువకులు పాశ్చాత్య పోకడలను అనుకరిస్తూ పెడ మార్గం పడుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీనేజ్‌లోనే మద్యం సేవించడం, ధూమపానం అలవాటు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. అందుకే.. అలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఆరోగ్య, మానసిక నిపుణులు.
మద్యపానం.. ధూమపానం వద్దు..
కౌమార దశ రాగానే పెద్దవారం అయిపోయామనే ఫీలింగ్‌తో యువత మద్యం, సిగరేట్‌కు అలవాటు పడడం సాధారణం. చెడు చెలిమితో.. నూనుగు మీసాల వయసులోనే ఇలాంటి వ్యసనాల బారినపడుతున్నారు. అలా చేయడం వల్ల భవిష్యత్ నాశనం అవడమే కాకుండా.. కన్నవారిని మోసం చేసినట్లే అవుతుంది. గత ఆదివారం ఏసీసీలో జరిగిన క్వారీ జాతరలో యువకులు తాగి నానా హంగామా చేయడం తాజా ఉదాహరణగా పేర్కొనవచ్చు. మద్యం మత్తులో గొడవలు, యువతులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడంలాంటివి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. పాన్‌షాప్‌లు, హోటళ్ల వద్ద యువకులు రింగ్‌రింగ్‌లుగా సిగరేట్ పొగ వదులుతూ.. ఇదే స్వర్గలోకమంటూ తన్మయత్వం చెందుతున్నారు. ఇలాంటి వాటికి దూరం ఉండడం చాలా మంచిది.
దూకుడు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి..
యువత చేత బైక్‌పట్టి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఆ బైక్ ఎంత స్పీడ్‌లో పోతుందో వారికే తెలియదు. అలాంటి సమయంలో జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే నష్టం తప్పదు. కన్నవారికి కడుపుకోతా తప్పదు. ముఖ్యంగా కౌమార దశలోనే ద్విచక్ర వాహనాల జోలికి పోకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కొద్దోగొప్పో స్పీడ్‌లో డ్రైవ్ చేయడం మంచిది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు, నలుగురు కూర్చోని రయ్‌మంటూ దూసుకెళ్లకుండా ఉంటే మంచిది.
అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలి..
కౌమార దశ యువకులు సినిమాల పోకడలను అనుకరిస్తూ యువతులను వేధించడం ఫ్యాషన్‌గా భావిస్తుంటారు. కళాశాలలో చదివే సహచర విద్యార్థినులను వేధించడం, వారికి ప్రేమ లేఖలు రాయడం చేస్తుంటారు. అలాంటి వాటికి మొత్తంగా దూరంగా ఉండడం భవిష్యత్తుకు మేలు. మహిళలను వేధిస్తే కఠిన చట్టాలున్నాయి. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తే భవిష్యత్ అంధకారమవుతుంది. అందుకే.. యువత ఉన్నత భావాలను అలవర్చుకుని.. ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజం గౌరవించే స్థాయికి ఎదగాలి.
తల్లీదండ్రుల బాధ్యత కీలకం
విద్యార్థుల భవిష్యత్ తల్లిదండ్రుల చేతుల్లోనూ ఉంది. పిల్లల మీద ప్రేమ కంటే వారి దిన చర్యలను, చెడు నడవడికను బాగా పరిశీలించాలి. విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి వాహనాల దొంగలుగా, చైన్‌స్నాచర్‌గా మారుతూ పట్టుబడి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే.. పిల్లలు ఏం చేస్తున్నారో నిశితంగా పరిశీలించాలి. సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ కనెక్షన్ రెండూ అందుబాటులో లేకుండా చూడాలి. సెల్‌ఫోన్‌ల వల్లనే విద్యార్థుల జీవితాలు గాడి తప్పుతున్నాయి. చెడు స్నేహాలూ చేయకుండా చూడాలి. బంగారు భవిష్యత్ ఎలా సాధ్యమవుతుందో ఎప్పటికప్పుడు వారికి వివరించాలి.
మానవతా విలువలు తెలియజేయాలి
యుక్త వయస్సు వారి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి అధ్యాపకు లు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మానవతా విలువలు తెలియజేయాలి. జాతీయ నాయకులు, దేశ భక్తుల చరిత్రను తెలియజేయాలి. మంచి పుస్తకాలు చదివేలా వారిని ప్రోత్సహించాలి. పాశ్చాత్య సంస్కృతికి బానిసలు కాకుండా చూడాలి. అమానవీయ సినిమాలు, సీరియల్స్‌ను చూడనీయొద్దు. తరగతి గదులే వారికి మార్గ నిర్దేశం కావాలి.
ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి...
ఆత్మ విశ్వాసం.. ఇది లేకపోతే మానవుడు జీవితంలో ముందుకు సాగలేడు. ఎదుగూబొదుగు ఉండదు. కష్టాల కడలిని ఎదురీదడానికి ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉండాలి. నిర్వేదం, నిరుత్సాహం, నిరాశను సమాధి చేయాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. ఆత్మవిశ్వాసం లేకపోతే చంద్ర మండలానికి చేరుకునే వారమా..? తమిళనాడుకు చెందిన సుధారామచంద్రన్ ప్రమాదంలో కాలు కోల్పోయినా కఋత్రమ (పెట్టుడు కాలు)తో నాట్యం చేసి ప్రపంచాన్ని నివ్వెర పరచలేదా..? అంతెందుకు తాజాగా రాష్ట్రానికి చెందిన ఆనంద్, పూర్ణ అనే విద్యార్థులు హిమాలయ పర్వతాలను అతిచిన్న వయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించ లేదా..? శాస్త్ర, సాంకేతిర రంగాల్లో అనేక మంది చరిత్రలో నిలిచిపోయారంటే అందుకు ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణమనే విషయాన్ని ఎలా విస్మరించ గలం. ఆత్మ విశ్వాసం వెంట ఉంటే చదువులో, వ్యాపారంలో ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపించొచ్చు. అందుకే.. యుక్త వయస్సుల్లోకి అడుగు పెట్టే యువతీ, యువకులు ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. ఆత్మన్యూనతా భావాన్ని దరికి చేరనివ్వ వద్దు. మానసికంగా ఎప్పుడూ కుంగిపోవద్దు. కుటుంబ పెద్దలపై ఆధారపడి సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామనే నిర్వేదం చెందొద్దు. దృఢ సంకల్పం కలిగి ఉండాలి. అప్పుడే విద్యలోనూ, జీవితంలోనూ అగ్రస్థానాలకు చేరుకుంటారు.
సాహసం చేయరా డింభకా..
సాహసం చేయరా డింభకా... ఈ డైలాగ్ తెలుగునాట ఇప్పటికీ పాపులరే. సాహసం చేస్తే ఏదైనా సాధించవచ్చు. చదువులో, వ్యాపారం, ఆటల్లో, పాటల్లో, మార్షల్ ఆర్ట్స్‌లో ఇలా అన్నింట్లో ప్రావీణ్యత సాధిం చాలి. ధైర్యంతో పోటీలో పాల్గొని విజయలక్ష్మిని అక్కున చేర్చుకోవాలి. ‘నాకు ఏదీ రాదు, ఏమి చేయలేననే’ సంకుచిత భావాన్ని త్యజించాలి. ధై ర్యంగా ముందుకు సాగితే ఎలాంటి కష్టాలనైనా ఇ ష్టంగా అధిగమించవచ్చు. ముఖ్యంగా విద్యా రంగంలో కఠినం అనుకునే పాఠ్యాంశాలను సులువుగా నేర్చుకుని ధైర్యంగా పరీక్షలు రాయాలి.
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి..
యుక్త వయస్సు విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరం. చదువు, క్రమ శిక్షణ, సభ్యతా, సంస్కారంతోపాటు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. కళాశాల స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుంటే సమాజానికి మేలు చేసే స్థాయికి ఎదుగుతారు. కళాశాల స్థాయిలోనే నాయకత్వ లక్ష ణాలకు శ్రీకారం చుట్టి ఎందరో రాజకీయాలు, చట్టసభల్లో అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఒకప్పుడు అస్సాం రాష్ట్రంలో కళాశాల విద్యార్థులు అస్సాం గణ పరిషత్ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. తాజా ఉదాహరణకు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యారంగ సమస్యలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై గళమెత్తిన బాల్క సుమన్ ఏకంగా పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. మంచి నాయకుడు కావాలంటే యుక్త వయస్సులోనే నాయకత్వం బీజం పడాలి.
ఉపకారం.. అందరికీ సహకారం..
‘పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని..’ అంటారు ఓ సినీ కవి. పరోపకార గుణం లేని మనిషి జీవితం దండగ ంటారు పెద్దలు. పాశ్చాత్య సంస్కృతి ప్రజ్వరిల్లుతున్న నేటి రోజుల్లో ఉపకారం, సహకారం అనేవి సామెతగానే మిగిలాయి. అందుకే.. మానవ సంబంధాలు మరుగునపడిపోకుండా కష్టాల్లో ఉన్న వారికి ఉపకారం, ఆపదలో ఉన్న వారికి సహకారం అందించే గుణాన్ని టీనేజర్లు అలవర్చాలి.
బలం- బలహీనతలు..
మనిషికి బలం, బలహీనతలు రెండూ ఉంటాయి. బలం మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తే బలహీనత తిరోగమనం వైపునకు పంపిస్తుంది. బలమంటే శారీరక బలం కాదు. ఆలోచనా అనే శక్తి బలం. ఆ ఆలోచనలు బలంగా ఉంటే భవిష్యత్ ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ‘దేనికైనా నేను వెంటనే నిర్ణయాలు తీసుకోలేను. అదే నా బలహీనత’ అని అంటుంటారు కొందరు. అలాంటి బలహీనతకు బానిసలు కావద్దు. బలాన్నే నమ్ముకోవాలి.
కౌమారాం వద్దు!
Published Mon, Jul 21 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement