నిలోఫర్ తుపానుగా మారనున్న వాయుగుండం
ముంబై/విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నిలోఫర్ తుపానుగా మారనుంది. ఇది ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతోంది. ముంబైకి నైరుతి దిశగా 1270 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా పయనించి ఒమన్, మెయెన్ దేశాల తీరంవైపు వెళ్లవచ్చని తెలుస్తోంది. అయితే, గుజరాత్, దక్షిణ పాకిస్తాన్‌ల వైపు కూడా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఈ కారణంగా కర్ణాటక, తెలంగాణ మీదగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్, కోస్తా తీర ప్రాంతాలలో ఈ నెల 30న భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గుజరాత్ తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున గుజరాత్ తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వాయుగుండ ప్రభావం వల్ల తెలంగాణలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 31నాటికి ఈ వాయుగుండం గుజరాత్, పాకిస్తాన్ లకు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో తీరం దాటే అవకాశం ఉంది. ఇది తీరం దాటే సమయంలో తెలంగాణపై కొంత ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
**