వితంతువులకు గౌరవం వద్దా?
న్యూఢిల్లీ: ఆవాస కేంద్రాల్లోని నిరుపేద వితంతువులకు తగిన గౌరవం దక్కడంలేదని సుప్రీం కోర్టు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. బృందావన్ అయినా దేశంలో మరెక్కడైనా పరిస్థితి ఇలాగే ఉందని పేర్కొంది. అసలు వారికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు రద్దయిపోయినట్లు మనం ప్రవర్తిస్తున్నామని విస్మయం వ్యక్తం చేసింది.
వితంతు పునర్వివాహం ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ అభిప్రాయపడింది. వితంతువులపై మూస ఆలోచనా ధోరణులకు వారి పునర్వివాహాలతో అడ్డుకట్టవేయొచ్చంది. వితంతువుల పరిస్థితిపై కోర్టుకు చేరిన పలు నివేదికలను అధ్యయనం చేసి, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సూచించాలని ఆదేశిస్తూ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
బలహీనవర్గాలతో సమానం..
తన రాజ్యాంగ విధుల్లో భాగంగానే నిర్భాగ్య వితంతువుల సమస్యల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది. ‘పిటిషన్ ప్రయోజనమేంటంటే ఆర్థికంగా బలహీన వర్గాల వారికి న్యాయం చేయడమే కాదు, సామాజిక వివక్షకు గురవుతున్న వారికి సాధికారత కల్పించడమూ. బృందావన్‌లో, దేశంలో ఇతర ఆవాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారంతా మన సమాజంలో బలహీన వర్గాల కిందికే వస్తారు. ఇతరులు వారిని చూస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది’ అని పేర్కొంది.