అసెంబ్లీలో బలపరీక్ష రేపే!
మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు తన బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతోంది. బుధవారమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో తనకు ఎంతమంది మద్దతు ఉందో నిరూపించాలి. మొత్తం 289 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం నిలబడాలంటే కనీసం 145 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి సొంతంగా 122 మంది, మరో మిత్రపక్షానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అంటే ఎంతలేదన్నా మరో 22 మంది మద్దతు అవసరం అవుతుంది.
తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామంటూ శివసేన లేఖ ఇచ్చినా.. ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని మరో ప్రకటన కూడా చేసింది. ఎన్సీపీ నేత శరద్ పవార్ బీజేపీ సర్కారుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. మళ్లీ ఎన్నికలు రాకూడదన్న ఉద్దేశంతోనే తాము మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మరెవరు మద్దతిచ్చినా తీసుకుంటామని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. అసెంబ్లీలో బల నిరూపణకు తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నంలోపే మరాఠా బరిలో ఏం జరిగిందో తెలిసిపోతుంది.