రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మంగళవారం శాసన సభ ధర్నాలతో దద్ధరిల్లింది. తొలుత జేడీఎస్, అనంతరం బీజేపీ సభ్యులు ధర్నాలకు దిగడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప పలు సార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మంగళవారం శాసన సభ ధర్నాలతో దద్ధరిల్లింది. తొలుత జేడీఎస్, అనంతరం బీజేపీ సభ్యులు ధర్నాలకు దిగడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప పలు సార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. విద్యుత్ శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు చర్చ సందర్భంగా జేడీఎస్ పక్షం నాయకుడు కుమార స్వామి మాట్లాడుతూ 2007-08 నుంచి 2012-13 వరకు విద్యుత్‌ను ఇష్టారాజ్యంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తునకు సభా సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేశారు.
ఉదయం సభలో విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ చర్చకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న జేడీఎస్ డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. దీంతో ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి ధర్నాకు దిగారు. సభ్యులను శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అధికార, జేడీఎస్ పక్ష సభ్యులను తన ఛాంబర్‌కు పిలిపించి, ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రయత్నించారు. కాసేపు చర్చల అనంతరం సభా సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం సమ్మతించింది. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సభలో ప్రకటన చేస్తూ 2006 నుంచి 2013 వరకు విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు చేయడానికి సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
దీనిపై ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2000 సంవత్సరం నుంచి విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి సీఎం సమ్మతించలేదు. జేడీఎస్ డిమాండ్ మేరకు సభా సంఘాన్ని ఏర్పాటు చేశామంటూ, 15 సంవత్సరాల కిందట విద్యుత్ కొనుగోలుపై ఇప్పుడు దర్యాప్తు చేయడం సరికాదని సమాధానమిచ్చారు. దీనిపై సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేసి, అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపారు. దర్యాప్తు కాల వ్యవధిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, దీనిపై ఉభయ సభల్లోని పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.