విభజన సమస్యలు పరిష్కారమవుతాయి
కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు ఒకటొకటిగా పరిష్కారమవుతున్నాయని.. మిగిలినవి కూడా పరిష్కారమవుతాయని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి త్రైమాసిక నివేదికను అందజేశారు. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ, సామాజిక పరిస్థితులను వివరించారు. అనంతరం నరసింహన్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ, ఏపీలు తమ మధ్య ఉత్పన్నమైన విభజన సమస్యలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. కమల్‌నాథన్ కమిటీపై తెలంగాణ ఉద్యోగులు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై ప్రశ్నించ గా... చిన్న చిన్న వివాదాలు సాధారణమని, వాటిని పెద్దవిగా చేయాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ భవన్‌లో బస చేసిన గవర్నర్... ఇక్కడి ఆప్కో వస్త్ర దుకాణంలో రెండు పోచంపల్లి చీరలు కొనుగోలు చేశారు.