ర్యాగింగ్ను కఠినంగా అణిచేస్తాం: గవర్నర్
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం నాడు ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆయన రాజ్నాథ్ సింగ్కు వివరించారు. కాలేజీలు, యూనివర్సిటీలలో ర్యాగింగ్ను కఠినంగా అణిచేస్తామని ఆయనకు తెలిపారు. ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ర్యాగింగ్ను అరికట్టాలని విద్యాశాఖ మంత్రులతో మాట్లాడామని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజీలు, యూనివర్సిటీలలో ర్యాగింగ్ జరగడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారంలో రాజ్యాంగ పరమైన సమస్య ఎదురైనప్పుడు దాన్ని అధిగమిస్తామని కేంద్ర హోం మంత్రికి నరసింహన్ చెప్పినట్లు తెలిసింది.