రేప్ బాధితులను అనుమానంతో చూడొద్దు: సుప్రీం
రేప్ బాధితులను అనుమానంతో చూడొద్దు: సుప్రీం
Published Fri, Dec 23 2016 9:45 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
అత్యాచార బాధితులు తాము చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని నిరూపించుకోడానికి సాక్ష్యాల కోసం వారిని ఇబ్బంది పెట్టకూడదని, వారిని అనుమానంతో చూడొద్దని సుప్రీంకోర్టు దిగువ కోర్టులకు స్పష్టం చేసింది. బాధితులు ఇచ్చే ప్రకటనల ఆధారంగానే ఇలాంటి కేసులలో నిందితులపై నేరారోపణలు రుజువు చేయొచ్చని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం సాప్రేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అత్యంత అరుదైన కేసులలో మాత్రమే ఆమె చేసిన ప్రకటనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్న అనుమానం వస్తేనే, అందుకు కారణాలేంటో కూడా చెప్పి చేయాలని అన్నారు.
బాధితులు చెప్పే విషయాలను నమ్మడానికి బదులు.. వాళ్లను అనుమానించడం వారిని మరింత అవమానాలకు గురిచేస్తుందని, అలాంటి సమయాల్లో బాధితులు చెప్పే విషయాలను యథాతథంగా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం చెప్పింది. అనుమానం, అపనమ్మకం, శంకలతో కూడిన అద్దాలతో అత్యాచార బాధితులైన బాలికలు లేదా మహిళలు చెప్పే సాక్ష్యాలను చూడకూడదని జస్టిస్ సిక్రీ ఈ తీర్పులో పేర్కొన్నారు. ఒకవేళ వాళ్లు చెప్పే విషయాలు నమ్మశక్యంగా లేవనిపిస్తే.. అప్పుడు ఆమె చెప్పేదాన్ని సమర్థించేలా మరిన్ని సాక్ష్యాలు మాత్రం కోరొచ్చని అన్నారు. ఇది కూడా అత్యంత అరుదైన కేసులలో మాత్రమే చేయాలన్నారు.
తొమ్మిదేళ్ల వయసున్న మేనకోడలిపై అత్యాచారం చేసిన వ్యక్తికి 12 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది. బాలిక, ఆమె తల్లి చెబుతున్న విషయాల్లో చిన్నపాటి తేడాలు ఉన్నందున కేసును కొట్టేస్తూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తోసిపుచ్చింది. ఘటన జరిగిన మూడు సంవత్సరాల తర్వాత బాలిక కుటుంబం ఫిర్యాదు చేసిందని కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ కేవలం ఆలస్యం అయినంత మాత్రాన అది తప్పుడు ఫిర్యాదుగా భావించకూడదని, ఇలాంటి సందర్భాలలో సామాజిక కారణాల వల్ల కూడా ఫిర్యాదు చేయడానికి వెనకాడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దాదాపు 80 శాతం అత్యాచార కేసులలో నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారని, అందులోనూ తెలిసినవారే ఎక్కువగా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని సుప్రీం అభిప్రాయపడింది. కుటుంబ సభ్యులే అత్యాచారాలు చేసినప్పుడు వివిధ కారణాల వల్ల ఫిర్యాదు చేయడానికి కూడా ఇబ్బంది పడతారని తెలిపింది.
Advertisement
Advertisement