
జిహాద్ అనే మకిలిని తొలగించొచ్చు: రామ్‌దేవ్
కశ్మీర్ వ్యాలీలో కల్లోలం సృష్టిస్తున్న వారి బుర్రల్లోని ఆలోచన మారాలంటే యోగా చేయాలని యోగా గురు రామ్‌దేవ్ బాబా సూచించారు.
న్యూఢిల్లీ: కశ్మీర్ వ్యాలీలో కల్లోలం సృష్టిస్తున్న వారి బుర్రల్లోని ఆలోచన మారాలంటే యోగా చేయాలని యోగా గురు రామ్‌దేవ్ బాబా సూచించారు. యోగా మనిషి మెదడును అదుపు చేస్తుందని, మానవ మృగాలుగా మారకుండా అడ్డుకుంటుందని చెప్పారు. యోగాలో పరిణితి సాధించిన ఏ ఒక్కరూ కూడా ఉగ్రవాదం వైపు అడుగులు వేయలేదని చరిత్ర చెబుతోందని అన్నారు.
వ్యాలీలో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన పిల్లలకు సమాజంలోని అన్ని విషయాలను బోధపడేలా చెప్పాలని సూచించారు. అన్ని రకాల మతాల గురించి, వాటి వైవిధ్య భరితమైన చరిత్రల గురించి వారికి వివరించినప్పుడే భవిష్యత్తుకు పునాది వేసినట్లు అవుతుందని అన్నారు. వ్యాలీలో అశాంతిని నింపుతున్న ఉగ్రవాదుల గుంపునకు యోగా నేర్పించడం ద్వారా వారి మనసుకు అంటుకున్న జిహాద్ అనే మకిలిని తొలగించొచ్చని తాను నమ్ముతున్నట్లు ఇండియా టీవీ కాన్‌క్లేవ్‌లో చెప్పారు.
చైనా వస్తువులను భారతీయులు స్వచ్చందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న చైనా దేశానికి చెందిన వస్తువులను బహిష్కరించడంలో తప్పేమీ లేదని అన్నారు. త్వరలో జమ్మూకశ్మీర్‌లో పతంజలి యూనిట్‌ను స్ధాపించనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం 150 ఎకరాల స్ధలాన్ని సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన యువతకు అందులో ఉద్యోగవకాశాలు కల్పిస్తానని చెప్పారు.