
కడుపులోంచి తీసిన నగలు, నాణేలను చూపుతున్న వైద్యుడు
రామ్‌పుర్‌హట్: కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో ఉన్న 1.5 కేజీల ఆభరణాలు, నాణేలను చూసి విస్తుపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా రామ్‌పురహాట్‌లో చోటుచేసుకుంది. మర్‌గ్రామ్‌కు చెందిన మానసికస్థితి సరిగా లేని 26 ఏళ్ల ఓ మహిళ కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి మహిళ కడుపులోంచి బంగారం, కాంస్యం, రాగితో చేసిన గొలుసులు, దుద్దులు, ముక్కుపుడకలు, గాజులు వంటి 1.5 కేజీల ఆభరణాలు, రూ.5, రూ.10 విలువ గల 90 నాణేలను బయటికి తీసినట్లు వైద్యులు తెలిపారు. తాము బయటకు తీసిన వాటిలో చేతి వాచీలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
‘నా కూతురి మానసిక పరిస్థితి సరిగా లేదు. కొద్దిరోజులుగా భోజనం చేసిన తర్వాత ప్రతి వస్తువును విసిరికొడుతోంది. మాయమైన ఆభరణాల గురించి అడిగిన ప్రతిసారి ఏడవడం మొదలు పెట్టేది. కొంత కాలంగా ఆమెను కనిపెట్టి చూస్తున్నాం. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. చాలా మంది ప్రైవేటు డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయింద’ని బాధితురాలి తల్లి వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment