‘ఐటీల్లో మహిళలకు నైట్ షిప్ట్స్‌కు నో’
బెంగళూరు: రాత్రి వేళల్లో మహిళలకు ఆయా కంపెనీల్లో బాధ్యతలు అప్పగించరాదని కర్ణాటక ప్రభుత్వ ప్యానెల్ ఒకటి స్పష్టం చేసింది. ఐటీ రంగంలో, బయోటెక్నాలజీ రంగంలో రాత్రి వేళల్లో మహిళలకు షిప్ట్‌లు వేయొద్దని సూచించింది. వారి భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా ఉండాలంటే బెంగళూరులోని ఏ కంపెనీ కూడా మహిళలకు రాత్రి పూట విధుల అప్పగించరాదని స్పష్టం చేసింది. మహిళ సంరక్షణ, చిన్నారుల సంక్షేమంపై కర్ణాటక ప్రభుత్వం ఓ శాసనసభా కమిటీని వేసింది.
దీనికి ఎన్‌ఏ హ్యారిస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించిన ఈ కమిటీ చివరకు ఐటీ, బీటీ రంగాల్లో మహిళలకు విధులు రాత్రి వేళల్లో అప్పగించరాదని, అందుకు తాము వ్యతిరేకం అని స్పష్టం చేసింది. వారికి ఉదయం లేదా మధ్యాహ్న వేళల్లో మాత్రమే బాధ్యతలు ఇవ్వాలని చెప్పింది. ఆయా కంపెనీలు రాత్రి పూట పనులకు పురుషులనే ఉపయోగించుకోవాలని సూచించింది. గత ఏడాది(2016) సెప్టెంబర్ 9 ఈ కమిటీ బెంగళూరులోని ఇన్‌ఫోసిస్, బైకాన్ వంటి కంపెనీలకు వెళ్లి ఫీడ్ బ్యాక్ తీసుకుని తాజాగా ఈ ప్రతిపాదనలు చేసింది.