ముంబై: మతపరమైన నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదంటూ శివసేన...కోర్టులకు సలహా ఇచ్చింది. ముంబైలోని బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మండపాలను, ఉత్సవాలను నిషేధిస్తూ ఇటీవల ముంబై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది.
మత నమ్మకాలకు సంబంధించిన అంశాలలో జోక్యం చేసుకోవద్దంటూ కోరింది. దీనివల్ల గణేష్ ఉత్సవం, నవరాత్రి, దహీహండీ, శివ జయంతి లాంటి హిందువుల పండగల సంస్కృతి నాశనమవుతుందని ఆవేదవ వ్యక్తం చేసింది. ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ అభిప్రాయాన్ని మొత్తం ప్రజల అభిప్రాయంగా కోర్టు ఎలా పరిగణిస్తుందని మండిపడింది. ఎలాంటి ఉత్సవాలు, పండుగలు లేనపుడు కూడా దేశ వ్యాప్తంగా వచ్చే పోయే జనాలతో ముంబాయి నగరం సంవత్సరం పొడవునా అత్యంత రద్దీగా ఉంటుందని పేర్కొంది.
భారీగా వచ్చి పడుతున్న ఈ వలసలను కోర్టులు కట్టడి చేయగలవా అని ప్రశ్నించింది. జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని స్పూర్తిని చంపి వేయడమే అని శివసేన అభిప్రాయపడింది. కోర్టులు ప్రజలందరికి న్యాయం జరిగేలా వ్యవహరించాలని సలహా ఇచ్చింది. ముఖ్యంగా కోర్టులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదంటూ వ్యాఖ్యానించింది.