
డైనమిక్ డజన్..'ఢిల్లీ డైలాగ్'
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అవిశ్రాంతంగా శ్రమించడం కూడా ఓ ముఖ్య కారణం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అవిశ్రాంతంగా శ్రమించడం కూడా ఓ ముఖ్య కారణం. 11 మంది పురుషులు, రిచా మిశ్రా పాండే అనే ఏకైక మహిళతో సరిగ్గా పోలింగ్‌కు ఏడు నెలల ముందు ఏర్పాటైన ఈ కమిటీ అభ్యర్థుల ఎంపిక, వారి ప్రచార కార్యక్రమాలను రూపొందించడంతోపాటు 'ఢిల్లీ డైలాగ్' పేరిట ప్రజలతో చర్చా గోష్ఠులు నిర్వహించడం అందులో వ్యక్తమైనా ప్రజాభిప్రాయాలను పార్టీకి నాయకత్వం, అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్లడం తదితర పనులను అకుంఠిత దీక్షతో నిర్వహించింది.
ఏ ప్రాంతంతో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, వాటికి సూచించాల్సిన పరిష్కారాలేమిటో ఎప్పటికప్పుడు పార్టీ అభ్యర్థులకు తెలియజేయడంతోపాటు ప్రజలతో ఎలా మమేకం కావాలో మార్గదర్శకత్వం వహించడంలో ఈ కమిటీ నూటికి నూరుపాళ్లు విజయం సాధించింది. అలాగే ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో గమనిస్తూ మీడియా ముందు వాటిని ఎలా తివ్పి కొట్టాలో కూడా పార్టీ అధికారు ప్రతినిధులను అణుక్షణం అప్రమత్తం చేస్తూ పార్టీ విజయావకాశాలను ఎంతో మెరుగుపర్చింది.
12 మందిగల ఎన్నికల ప్రచార కమిటీలోని కొంత మంది సభ్యులు ప్రజలకే కాకుండా పార్టీ క్రియాశీలకు సభ్యులకు కూడా పరిచయం లేకపోవడం విశేషం. 2007లో కాంగ్రెస్ పార్టీని వదిలేసి కేజ్రివాల్ పిలుపు మేరకు పార్టీలో చేరిన ఆశీష్ తల్వార్ పెద్దగా ప్రజలకు తెలియదు. అయినా ఆయన పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించడంతోపాటు పార్టీ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. అలాగే బీబీసీ మాజీ జర్నలిస్ట్ నాగేందర్ శర్మ పార్టీ మీడియా విధానాన్ని రూపొందించారు. పోలింగ్ కేంద్రాల కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ పట్లగల అభిమానాన్ని ఓట్లుగా మరల్చుకోవడంలో విశేష పాత్ర నిర్వహించిన దుర్ఘేష్ పాఠక్ కూడా సుపరిచితుడేమీకాదు. కమిటీలోని మిగతా సభ్యులు కూడా ఎవరి బాధ్యతలను వారు చక్కగా నిర్వహించారు.
అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ముందస్తు సర్వే నిర్వహించి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే మిజయావకాశాలు ఎక్కువగా ఉంటాయో అంచనా వేయడంలో ఎన్నికల ప్రచార కమిటీ సక్సెస్ అయింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రతిఫలింపచేయడంలోనూ కమిటీ కృషి ప్రశంసనీయం. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా భారీ ఎన్నికల ప్రచార సభల ఆర్భాటానికి వెళ్లకుండా ఐదారు వేల మంది ఓటర్లు హాజరయ్యేలా వీధి ప్రచార సభలను ఏర్పాటుచేసి వాటన్నింటిని ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించేలా చేయడంలో అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలే ఇచ్చింది.
-నరేందర్ రెడ్డి
నెట్ డెస్క్