
ఈవీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓటర్లను తప్పుదారిపట్టించినందుకు చత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కవసి లక్మాకు ఈసీ బుధవారం నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈసీ ఆయనకు జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఈవీఎంలోని రెండో బటన్ నొక్కితే ఓటర్లు విద్యుత్ షాక్‌కు గురవుతారని లక్మా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈవీఎంలో తొలి బటన్ నొక్కండి..రెండో బటన్ నొక్కితే మీకు విద్యుత్ షాక్ తగులుతందని చత్తీస్‌గఢ్‌లోని కంకర్ జిల్లాలో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో వాణిజ్య పరిశ్రమల మంత్రి లక్మా వ్యాఖ్యానించారు. లక్మా వ్యాఖ్యలు ఈవీఎంల పనితీరుపై ఓటర్లను తప్పుదారిపట్టించేలా ఉన్నాయని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుక్మా జిల్లాలోని కొంటా స్ధానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన లక్మా 2013, మే 25న బస్తర్‌లో కాంగ్రెస్ కాన్వాయ్‌పై జరిగిన నక్సల్స్ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడిలో 27 మంది మరణించిన సంగతి తెలిసిందే.