
దాసరిపై ఈడీ కేసు
బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ (నగదు అక్రమ లావాదేవీలు) కేసు నమోదు చేసింది.
‘బొగ్గు గనుల’పై సీబీఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈడీ
జిందాల్, దాసరి సంస్థల మధ్య అక్రమ లావాదేవీలు
జరిగినట్లు గుర్తించటంతో కేసు: ఈడీ వర్గాలు
జిందాల్‌కు గనుల కేటాయింపునకు ప్రతిఫలంగా
దాసరి సంస్థల్లోకి నిధులు మళ్లాయని ఆరోపణలు
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ (నగదు అక్రమ లావాదేవీలు) కేసు నమోదు చేసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలపై సీబీఐ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈడీ.. నగదు అక్రమలావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నమోదు చేసిన ఈ ఎఫ్‌ఐఆర్‌లో 35వ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పలువురిని కూడా నిందితులుగా పేర్కొంది. గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, న్యూఢిల్లీ ఎక్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, సౌభాగ్య మీడియా లిమిటెడ్‌లతో పాటు గుర్తుతెలియని మరికొందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. జిందాల్‌కు సంబంధించిన సంస్థలు - హైదరాబాద్‌లోని దాసరికి చెందిన సంస్థల మధ్య వివిధ స్థాయిల్లో లావాదేవీలు జరిగాయని, 2008లో జిందాల్‌కు దాసరి జార్ఖండ్‌లోని బొగ్గు గనులు కేటాయించినందుకు ప్రతిఫలంగా అక్రమ నగదు బదిలీ చేసినట్లు గుర్తించటంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన బ్యాంకింగ్, ఇతర లావాదేవీలను సేకరించటం ఈడీ ప్రారంభించిందని, నిందితుల స్థిర, చరాస్తులను లెక్కకడుతోందని వివరించాయి. ఇవే సంస్థలు, వ్యక్తులపై సీబీఐ కూడా అవినీతి నిరోధక చట్టం కింద చేసిన ఫిర్యాదులో ఇవే అభియోగాలు చేసింది. బొగ్గుగనుల కుంభకోణానికి సంబంధించి సీబీఐతో పాటు ఈడీ కూడా మరికొన్ని సంస్థలు, వ్యక్తులపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తప్పు చేసుంటే ప్రధాని నన్ను తొలగించేవారు: దాసరి
బొగ్గు శాఖ సహాయ మంత్రిగా తాను బొగ్గు గనుల కేటాయింపుల్లో ఎలాంటి తప్పు చేసినా ప్రధాని మన్మోహన్‌సింగ్ తనను తొలగించేవారని అభియోగాలు ఎదుర్కొంటున్న దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా .. అప్పుడు ఆ శాఖ కేబినెట్ మంత్రులుగా ఉన్న శిబూసోరెన్, మన్మోహన్‌లే తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ ఇటీవల రాసిన ఒక పుస్తకంలో దాసరి, సోరెన్‌లపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఆయన (పరేఖ్) బొగ్గు గనుల కేటాయింపుల కోసం బిడ్డింగ్ నిర్వహించాలంటే నేను తిరస్కరించానన్నది ఆయన ఆరోపణ. అంటే అందుకు నేను సహకరించలేదని. సహకరించకపోవటానికి నేనెవరిని? నేను కేవలం సహాయమంత్రిని. అక్కడ ఒక కేబినెట్ మంత్రి ఉన్నారు. కొన్నిసార్లు కేబినెట్ మంత్రిగా శిబూసోరెన్ ఉన్నారు. కొన్నిసార్లు కేబినెట్ మంత్రిగా ప్రధానమంత్రే ఉన్నారు’’ అని దాసరి స్పందించారు. బొగ్గు మంత్రిత్వశాఖలో కొత్త విధానాలను ప్రవేశపెట్టాలంటే కొన్ని ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయని.. ఈ విషయాలను తాను కేబినెట్ మంత్రికో, ప్రధానమంత్రికో నివేదించాల్సి వచ్చిందని చెప్పారు. తాను పేర్కొన్న సమస్యలు సరైన సమస్యలు కాకపోయినట్లయితే వారు తక్షణమే నిర్ణయం తీసుకుని ఉండేవారు.. ప్రధానమంత్రి నన్ను తీసిపారేసేవారు. ఆయన ఎందుకు అలా చేయలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.