సాక్షి, కోల్‌కతా : పోంజి స్కామ్‌కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కేడీ సింగ్‌కు చెందిన రూ 238 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సోమవారం సీజ్ చేసింది. కుఫ్రిలోని రిసార్ట్, చండీగఢ్‌లో ఓ షోరూమ్‌తో పాటు హర్యానాలో ఎంపీకి చెందిన పలు ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఎంపీ సింగ్‌కు చెందిన పలు బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపచేశారు. రూ 1900 కోట్ల ఈ కుంభకోణంలో సింగ్ పాత్రపై గత కొంత కాలంగా ఈడీ దృష్టి సారించింది.
2016 సెప్టెంబర్ నుంచి సింగ్‌తో పాటు ఆయనకు చెందిన అల్‌కెమిస్ట్ ఇన్‌ఫ్రా రియల్టీ లిమిటెడ్‌పై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా పెట్టుబడులను సమీకరించే స్కీమ్‌ను ప్రారంభించిందని 2015 నుంచి రూ 1916 కోట్లను చట్టవిరుద్ధంగా సేకరించిందని సెబీ, ఈడీ ఆరోపిస్తున్నాయి.
సెబీ అనుమతి లేకుండానే ఈ సంస్ధ పెట్టుబడులను సేకరించే స్కీమ్‌ను ప్రారంభించిందని, మదుపుదారులను మోసగించిందని దర్యాప్తు ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. 2016లోనే ఈ కంపెనీపై సెబీ పటియాలా హౌస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటినుంచి కంపెనీ అధికారులను ప్రశ్నిస్తున్న ఈడీ తన విచారణలో భాగంగా ఈ కార్యకలాపాల వెనుక తృణమూల్ ఎంపీ సింగ్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment