కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషెక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. పాఠశాల ఉద్యోగాల కుంభకోణం దర్యాప్తులో భాగంగా నవంబర్ తొమ్మిదో తేదీన(నేడు) కోల్‌కతాలో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మహిళా మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి అయిన శశి పంజా చెప్పారు.
‘ మా పార్టీ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శి అభిషెక్‌ను ఈడీ కక్షపూరిత రాజకీయాలకు బాధితుడిగా మార్చేసింది’ అని ఆమె ఆరోపించారు. సమన్లలో పేర్కొన్న మేరకు అభిషెక్ బెనర్జీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ‘‘వచ్చే సంవత్సరం కీలకమైన ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ నేతలను బెదిరించడానికి బీజేపీ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతోంది’’ అని శశి అన్నారు. దీనిపై పశి్చమబెంగాల్ బీజేపీ రాష్ట్ర విభాగం స్పందించింది. ‘ కక్షసాధింపు రాజకీయాలపై మాకు నమ్మకం లేదు.
జాతీయ దర్యాప్తు సంస్థలు కోర్టు ఆదేశాల మేరకే ఇలా సమన్లు జారీ చేస్తాయి. మీకేమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించండి’ అని బీజేపీ అధికార ప్రతినిది సంబిత్ పాత్రా అన్నారు. ఇప్పటికే అక్టోబర్‌లో బెనర్జీ ఈడీ ఎదుట హాజరైన విషయం విదితమే. సెపె్టంబర్ 13వ తేదీన ఆయనను ఈడీ అధికారులు ఏకంగా తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కీలక ‘ఇండియా’ కూటమి సమావేశంలో పాల్గొనకుండా టీఎంసీ నేతలను అడ్డుకునేందుకే ఈడీ ఆనాడు అలా చేసిందని అప్పుడే అభిషెక్ ఆరోపించారు. గతంలో బొగ్గు కుంభకోణం కేసులో 2021, 2022 సంవత్సరాల్లో అభిషేక్‌ను ఈడీ అధికారులు రెండు పర్యాయాలు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment