ఎన్నికల అనంతర పొత్తు ప్రయత్నాలు!
అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 4, 11 తేదీల్లో జరిగిన తొలి రెండు దశల్లోనే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తొలి దశలో 82.2 శాతం, మలి దశలో 87.03 శాతం పోలింగ్ నమోదుచేసి ఓటర్లు రికార్డు సృష్టించారు. మొత్తంగా 84.72 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2014 సాధారణ ఎన్నికల్లో నమోదైన రికార్డు పోలింగ్ 80 శాతం కన్నా అధికం. ఇంతటి రికార్డు పోలింగ్ దేనికి సంకేతమని ఇప్పుడు ప్రధాన పక్షాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఎన్నికల అనంతర దోస్తీకి సంసిద్ధంగానే ఉంది. బీజేపీ ఇప్పటికే తన మిత్రపక్షమైన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)తో పాటు.. ఏజీపీతోనూ జట్టుకట్టి బరిలోకి దిగింది. ఆల్ ఇండియా యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్).. జేడీయూ, ఆర్‌జేడీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం తరుణ్‌గొగొయ్ పదిహేనేళ్ల పాలన నుంచి ‘పరివర్తన్’ కావాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపుకే ఇంతటి ప్రతిస్పందన లభించిందని పలువురు భావిస్తున్నారు.
అయితే.. ఆయా జిల్లాల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని మరికొందరు చెప్తున్నారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ 55 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికలకు ముందు ఒక సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ 52 స్థానాలు గెలుచుకుంటుందనీ జోస్యం చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏఐయూడీఎఫ్ 12 సీట్లు గెలుచుకుని.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని ఆ సర్వే వివరిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగియటంతో.. బీజేపీ, ఏఐయూడీఎఫ్‌ల మధ్య జమ్మూకశ్మీర్ తరహాలో ఎన్నికల అనంతర పొత్తు కోసం చర్చలు మొదలయ్యాయి.