గౌహతి హైకోర్టు తీర్పుపై నిపుణులు ఏమంటున్నారు?
గౌహతి హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులు ఆసక్తిర వ్యాఖ్యలు చేస్తున్నారు. తీర్పు ప్రభావం చాలా విసృ్తతంగా ఉంటుందని, సీబీఐ ఏర్పాటు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ఆ సంస్థ నమోదు చేసిన కేసులన్నీ చెల్లకుండా పోతాయని చెబుతున్నారు. దేశాన్ని కుదిపేసిన కేసులను ఎన్నింటినో సీబీఐ దర్యాప్తు చేసిందని, వీటిల్లో దోషులకు శిక్షలు కూడా పడ్డాయని, తాజా తీర్పుతో వాటన్నింటిపైనా ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. జైల్లో ఉన్నవారంతా బయటకు రావడానికి మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. ఈ కేసులన్నీ నిలబడాలంటే గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం లేదా మొత్తంగా కొట్టివేయడంగానీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. తీర్పును కొందరు న్యాయ నిపుణులు స్వాగతిస్తుండడగా.. మరికొందరు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
మాజీ డెరైక్టర్లు ఏమన్నారు..?
తీర్పు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనిపై కేంద్రం, సీబీఐ తక్షణమే దృష్టి సారించి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సుప్రీంకోర్టు సూచనల మేరకు వాటన్నింటిని సరిచేయాలి. -విజయ్ శంకర్, సీబీఐ మాజీ డెరైక్టర్
ఈ తీర్పు ప్రభావం ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులపై ఏమాత్రం ఉండబోదు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎస్‌పీఈ) చట్టం కింద సీబీఐ కేసులను దర్యాప్తు చేస్తోంది. డీఎస్‌పీఈకి చట్టబద్ధత ఉన్నందున సీబీఐ కేసుల్లో దర్యాప్తులు యథాతథంగా కొనసాగుతాయి. - సీబీఐ మాజీ డెరైక్టర్ పీసీ శర్మ
నేను ఆనాడే చెప్పా
నా అభిప్రాయం ప్రకారం సీబీఐ చట్టబద్ధ సంస్థ కాదు. బ్రిటిష్ కాలంలో ఓ చట్టం ద్వారా ఇది ఏర్పాటైంది. సీబీఐకి చట్టబద్ధత కల్పించాల్సిందిగా 2010లో పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రతిపాదించా. ఆమోదం దాకా రాలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. తాజా తీర్పు నేపథ్యంలో అందరినీ సంప్రదించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. - మనీష్ తివారి, కేంద్ర సమాచార శాఖ మంత్రి